నారాయణ ‘లీక్స్‌’.. వెలుగులోకి నివ్వెరపోయే విషయాలు..

12 May, 2022 11:35 IST|Sakshi

ఆధారాలతోనే  అరెస్టు

నారాయణ బెయిల్‌ రద్దుపై న్యాయస్థానంలో అప్పీలు చేస్తాం

అనంతపురం డీఐజీ ఎం.రవిప్రకాష్‌

అనంతపురం క్రైం/చిత్తూరు అర్బన్‌: పదో తరగతి ప్రశ్నపత్రం లీక్‌ కేసులో నిందితులు ఇచ్చిన సమాచారం, సేకరించిన ఆధారాలతోనే నారాయణ విద్యాసంస్థల అధినేత పి.నారాయణను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారని డీఐజీ ఎం.రవిప్రకాష్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కేసును పకడ్బందీగా, క్షుణ్నంగా విచారించడంతో నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు.

విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేలా, ప్రతిభావంతులైన విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడేలా నారాయణ యాజమాన్యం వ్యవహరించిందన్నారు. నారాయణ ఆదేశాల మేరకు డీన్, వైస్‌ ప్రిన్సిపాళ్లు, ప్రిన్సిపాళ్లు కలసి కొందరు స్వార్థపరులైన ఉపాధ్యాయులను, సిబ్బందిని డబ్బులతో లోబర్చుకున్నట్లు వెల్లడైందన్నారు. ఈ విషయాన్ని వారే పోలీసు విచారణలో ఒప్పుకున్నట్లు తెలిపారు. పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసి వాట్సాప్‌ ద్వారా తెప్పించుకుని నారాయణ విద్యా సంస్థల హెడ్‌ ఆఫీస్‌కు పంపారని చెప్పారు.

దర్యాప్తులో ఇవన్నీ నిర్ధారణ కావడంతో నారాయణతో పాటు మరో తొమ్మిది మందిని అరెస్టు చేశామన్నారు. ఈ కేసులో నారాయణకు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సాక్ష్యాధారాలతో కోర్టులో అప్పీల్‌ చేస్తామని చెప్పారు. కాగా, చిత్తూరు మేజిస్ట్రేట్‌ న్యాయస్థానం మాజీ మంత్రి నారాయణకు ఇచ్చిన బెయిల్‌పై హైకోర్టులో అప్పీలు చేయనున్నట్టు చిత్తూరు ఎస్పీ రిషాంత్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన పదో తరగతి పరీక్షల మాల్‌ ప్రాక్టీస్‌ ఘటనలో నిందితులు ఎంతటివారైనా వదిలేది లేదని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు