వారిని రప్పించండి లేదా కేసు కొట్టేయండి 

23 Mar, 2022 01:22 IST|Sakshi
ఉగ్రవాది ఎజాజ్‌ షేక్‌

ముంబై కోర్టులో దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల ఉగ్రవాది పిటిషన్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి రాష్ట్రంలో 2013లో జరిగిన దిల్‌సుఖ్‌నగర్‌లో జంట పేలుళ్ల కేసులో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న ఇండియన్‌ ముజాహిదీన్‌ (ఐఎం) ఉగ్రవాది ఎజాజ్‌ షేక్‌ గత వారం ముంబై కోర్టుకెక్కాడు. తనపై ముంబై సైబర్‌సెల్‌ పోలీసులు నమోదు చేసిన మరో కేసులో దర్యాప్తు అధికారులను కోర్టుకు రప్పించాలని లేదా కేసు కొట్టేయాలని తన న్యాయవాదుల ద్వారా కోరాడు. ‘దిల్‌సుఖ్‌నగర్‌’కేసులో ఎజాజ్‌కు 2016లో ఎన్‌ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వగా వివిధ నగరాల్లోనూ అతనిపై విధ్వంసం కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం ఎజాజ్‌ మహారాష్ట్రలోని ఎరవాడ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు. 

టెర్రర్‌ మెయిల్స్‌పై మరో కేసు: 2013–14ల్లో ఐఎంకు చెందిన అనేక మందిని ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు అరెస్టు చేశారు. అదే ఏడాది సెప్టెంబర్‌ 5న ఎజాజ్‌ షేక్‌ను మహారాష్ట్రలో పట్టుకున్నారు. ఇతర ఉగ్రవాదులతోపాటు అతన్నీ ఎన్‌ఐఏ అధికారులు హైదరాబాద్‌ తీసుకొచ్చి దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల కేసులో విచారించారు. అదే సందర్భంలో ‘టెర్రర్‌ మెయిల్స్‌’పంపింది ఎజాజ్‌ షేక్‌ అని తేలడంతో ముంబై సైబర్‌సెల్‌ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. చార్జ్‌షీట్‌ సైతం దాఖలు చేయడంతో 2017లో ఈ కేసు కోర్టు విచారణకు వచ్చింది. 

58 సార్లు విచారణ వాయిదా... 
అప్పటి నుంచి దర్యాప్తు అధికారు లు న్యాయస్థానంలో హాజరుకావట్లేదు. ఫలితంగా వరుస వాయిదాలు పడుతూ పోయింది. ఆ ఏడా ది ఆగస్టు 14 నుంచి 2019 వరకు మొత్తం 58 సార్లు వాయిదా పడినా పోలీసులు కోర్టుకు హాజరుకాలేదు. దీంతో ఎజాజ్‌ షేక్‌ తన న్యాయవాదుల సాయంతో గత వారం ముం బై కోర్టులో ‘నాన్‌ అప్పీరెన్స్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌’పై పిటిషన్‌ దాఖలు చేయించాడు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం పోలీసులకు నోటీసులు జారీ చేసింది.  

>
మరిన్ని వార్తలు