చైనా లోన్‌యాప్స్‌ ఆగడాలు.. భాష రాకపోయినా ‘డింగ్‌టాక్‌’ తో

19 Jun, 2022 11:03 IST|Sakshi

చైనా రుణాల కేసులో కీలకంగా మారిన యాప్‌

ఈ యాప్‌ ద్వారా మాట్లాడితే కావాల్సిన భాషలో వినే సదుపాయం 

ఢిల్లీ ముఠా అరెస్టుతో గుర్తించిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: చైనా తప్ప మరో భాష సరిగ్గా రాని అక్కడి సూత్రధారులు.. హిందీ, ఇంగ్లిషు మినహా మరొకటి తెలియని ఇక్కడి పాత్రధారులు.. అయినా చైనా నుంచి వస్తున్న ఆదేశాలను పక్కాగా ఎలా అమలు చేస్తున్నారు? లోన్‌ యాప్స్‌ కేసుల్లో రాష్ట్రంలోని వివిధ విభాగాలకు చెందిన పోలీసులను ఇప్పటి వరకు వేధించిన ప్రశ్న ఇది. హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దీనికి సమాధానం తెలుసుకున్నారు.

సూత్రధారులు, పాత్రధారుల మధ్య సంప్రదింపుల కోసం డింగ్‌టాక్‌ యాప్‌ వాడుతున్నట్లు గుర్తించారు. ఇందులో సెట్టింగ్స్‌ చేసుకోవడం ద్వారా మాట్లాడితే ఏ భాషనైనా, ఏ భాషలోకైనా తర్జుమా చేసి అవతలి వారికి వినిపిస్తుంది. దాదాపు 60 లోన్‌యాప్స్‌ నిర్వహిస్తూ రుణగ్రస్తుల్ని వేధించిన ఢిల్లీ ముఠాను పట్టుకున్న అధికారులు వారిని విచారించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నలుగురు నిందితుల కస్టడీ గడువు శనివారంతో ముగియడంతో వారిని కోర్టులో హాజరుపరచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. 

60 లోన్‌యాప్స్‌తో చైనీయుడి ఆగడాలు..
చైనాకు చెందిన విక్టర్‌ మొబైల్‌ క్యాష్, క్యాష్‌ అడ్వాన్స్, హ్యాండీ క్యాష్, రుపీ బాక్స్, ఫాస్ట్‌ రుపీ సహా మొత్తం 60 లోన్‌యాప్స్‌ ఏర్పాటు చేశాడు. వీటిని నిర్వహించడం కోసం బిహార్‌కు చెందిన రాంబాబును నియమించుకున్నాడు. ఈ క్రమంలో యాప్స్‌ నుంచి రుణం తీసుకుని కట్టలేకపోయిన వారిని వేధించి, బెదిరించి డబ్బు వసూలు చేయడానికి కాల్‌ సెంటర్‌ కావాలని విక్టర్‌.. రాంబాబును కోరాడు.

దీంతో అతను గతంలో తనతో కాల్‌ సెంటర్‌లో పని చేసిన ఢిల్లీ వాసులు ఆకాశ్‌ మిశ్రా, సుల„Š్యసింగ్‌లను సంప్రదించి వారిని టీమ్‌ లీడర్, రికవరీ మేనేజర్లుగా నియమించాడు. అనంతరం వీరిద్దరు ఆగ్రాకు చెందిన రాహుల్‌ వర్మ, ప్రజాపతి అనిల్‌ తదితరుల ద్వారా కొందరు టెలికాలర్లను నియమించుకున్నారు. ఢిల్లీకి చెందిన టెలికాలర్లు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానంలో పని చేస్తూ రుణగ్రస్తులకు ఫోన్లు చేసి వే«ధిస్తున్నారు. ఎవరు ఎంత రుణం తీసుకున్నారు? ఎంత చెల్లించారు? ఏ మేరకు బాకీ ఉంది? తదితరాల డేటాకోసం వీళ్లు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ రూపొందించుకున్నారు. దీనిని ఉపయోగించి టెలీకాలర్లు తమ వద్ద ఉన్న జాబితాలోని రుణగ్రస్తుడి ఫోన్‌ నంబర్‌ ఎంటర్‌ చేస్తే ఈ వివరాలన్నీ తెలుస్తాయి. ఒక్కో టెలికాలర్‌కు గరిష్టంగా 700 మంది కస్టమర్లతో మాట్లాడే బాధ్యతలు అప్పగించారు.

హైదరాబాద్‌లో మూడు కేసులు
ఈ డేటా మొత్తాన్ని విక్టర్‌ చైనా నుంచి రాంబాబు ద్వారా వీరికి చేరుస్తున్నాడు. ఈ యాప్స్‌ వేధిం పులకు సంబంధించి హైదరాబాద్‌లో మూడు కేసు లు నమోదయ్యాయి. వీటిని దర్యాప్తు చేసిన ఇన్‌స్పెక్టర్‌ జి.వెంకట్రామిరెడ్డి నేతృత్వంలోని బృందం సాంకేతిక ఆధారాలను బట్టి ఆకాశ్‌ మిశ్రా, సుల„Š్యసింగ్, రాహుల్‌ వర్మ, ప్రజాపతి అనిల్‌ ఆచూకీని ఢిల్లీలో కనిపెట్టింది.

ఈ నెల 4న అక్కడ దాడి చేసిన అధికారులు నలుగురినీ అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని శనివారం వరకు విచారించారు. ఇందులో భాగంగా ఇన్‌స్పెక్టర్‌ జి. వెంకట్రామిరెడ్డి విక్టర్‌–రాంబాబు మధ్య ఎలా సంప్రదింపులు జరుగుతున్నాయనే అంశంపై దృష్టి పెట్టారు. ఈ కోణంలోనే నిందితులను విచారించారు.

డింగ్‌టాక్‌ సంగతి ఇలా బయటపడింది..
రాంబాబు ఓ సందర్భంలో ప్రస్తుతం అరెస్టయిన నిందితుల ఎదురుగానే డింగ్‌ టాక్‌ యాప్‌ ద్వారా విక్టర్‌తో మాట్లాడాడు. అందులో సెట్టింగ్స్‌ మార్చడం ద్వారా ఇతడు హిందీలో మాట్లాడే అంశాలు విక్టర్‌కు చైనా భాషలో, అతడు చైనీస్‌లో మాట్లాడేవి రాంబాబుకు హిందీలో వినిపించేలా ఏర్పాటు చేసుకున్నారు. నిందితుల విచారణ సందర్భంగా పోలీసులు ఈ విషయాన్ని కనిపెట్టారు.

వీరి మధ్య నగదు లావాదేవీలన్నీ హవాలా రూపంలో సాగేవి. ప్రస్తుతం పరారీలో ఉన్న రాంబాబు కోసం ప్రత్యేక బృందం గాలిస్తోంది. అతను చిక్కితేనే విక్టర్‌తో ఉన్న పరిచయాలు, ఇతర కాల్‌ సెంటర్ల వివరాలు తెలుస్తాయని పోలీసులు చెపుతున్నారు. మొత్తానికి ఈ కేసు ద్వారా హైదరాబాద్‌ పోలీసులు రెండేళ్లుగా మిస్టరీగా ఉన్న లోన్‌యాప్స్‌లో సూత్రధారులైన చైనీయులు, పాత్రధారులైన భారతీయుల మధ్య జరుగుతున్న సమాచారమార్పిడి విధానాన్ని కనిపెట్టగలిగారు.  

మరిన్ని వార్తలు