ఫిర్యాదు చేస్తే అవిటితనాన్ని వెక్కిరించి కొట్టి...

24 May, 2022 10:54 IST|Sakshi

అనంతపురం క్రైం: ‘న్యాయం కోసం పోలీసు స్టేషన్‌కు వెళితే.. కుంటి నాయాలా.. వడ్డీ వ్యాపారం చేస్తావా? అంటూ పామిడి సీఐ ఈరన్న కొట్టాడు’ అని ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప ఎదుట ఓ దివ్యాంగుడు కన్నీటి పర్యంతమయ్యాడు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఫక్కీరప్ప చేపట్టిన స్పందన కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పామిడి మండలం కట్టకిందపల్లికి చెందిన దివ్యాంగుడు సుంకిరెడ్డి తనకు జరిగిన అన్యాయంపై ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు.

ఆపద సమయంలో కొందరికి రూ.లక్షల్లో డబ్బు ఇచ్చానని, ప్రస్తుతం వారు ఆ డబ్బు వెనక్కు ఇవ్వకుండా తనకు అన్యాయం చేయాలని చూస్తున్నారని వాపోయాడు. దీనిపై పామిడి సీఐ ఈరన్నకు ఫిర్యాదు చేస్తే తన అవిటితనాన్ని వెక్కిరించి కొట్టాడని ఫిర్యాదు చేశాడు. కాగా, స్పందన కార్యక్రమానికి వివిధ సమస్యలపై మొత్తం 94 ఫిర్యాదులు అందాయి. అదనపు ఎస్పీ నాగేంద్రుడు, ఎస్‌బీ సీఐ చక్రవర్తితో కలిసి వినతులను ఎస్పీ స్వీకరించి, పరిశీలించారు. తక్షణ పరిష్కారం నిమిత్తం ఆయా స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లను ఆదేశించారు.  

79 సెల్‌ఫోన్ల అందజేత 
పోగొట్టుకున్న సెల్‌ఫోన్లను సంబంధీకులకు ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప అందజేశారు. సోమవారం డీపీఓలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో 79 మందికి ఆయన సెల్‌ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సెల్‌ఫోన్‌ పోగొట్టుకున్నవారు 94407 96812 వాట్సాఫ్‌ నంబర్‌కు సమాచారం అందించడంతో వాటిని రికవరీ చేసి అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకూ 541 సెల్‌ఫోన్లను రికవరీ చేసి, 450 మంది సంబంధీకులకు అందజేసినట్లు పేర్కొన్నారు.  

మిస్సింగ్‌ కేసులను నిర్లక్ష్యం చేయొద్దు : ఎస్పీ 
మిస్సింగ్‌ కేసుల ఛేదింపులో నిర్లక్ష్యం తగదని పోలీసు అధికారులను ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప సూచించారు. పిల్లలు, మహిళలు, యువతులు... ఇలా కనిపించకుండా పోయిన వారిపై సంబంధీకులు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించాలన్నారు. మిస్సింగ్‌ కేసులకు సంబంధించి సోమవారం డీపీఓలో సీఐలతో ఆయన సమీక్షించారు. వివిధ పీఎస్‌ల్లో పెండింగ్‌లో ఉన్న మిస్సింగ్‌ కేసులపై ఆరా తీశారు.

ఛేదింపులో విఫలమైన అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. మిస్సింగ్‌ అయిన వ్యక్తుల ఫొటోలను సామాజిక మాధ్యమాల ద్వారా     విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో మాట్లాడి దర్యాప్తునకు ఉపయోగపడే వివరాలు సేకరించాలన్నారు. ఈ విషయంగా నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.   

(చదవండి: రెండు రోజుల్లో పెళ్లి.. అంతలోనే ఆత్మహత్య)

మరిన్ని వార్తలు