పోలీసుల నుంచి ప్రాణహాని

28 Aug, 2021 02:09 IST|Sakshi
గుడిగండ్లలో జొల్లు శివ తండ్రి రాజప్ప ఇంటి దగ్గర పోలీసులు 

విచారణ కమిషన్‌కు ‘దిశ’నిందితుల కుటుంబసభ్యుల వెల్లడి 

లాడ్జ్‌లో బస చేసిన వీరిని ఖాళీ చేయించిన యజమాని 

ఓ న్యాయవాది ఇంట్లో తలదాచుకున్న వైనం 

‘దిశ’సోదరిని కూడా విచారించిన కమిషన్‌ 

సాక్షి, హైదరాబాద్‌/మక్తల్‌: ‘దిశ’నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌ దర్యాప్తును ముమ్మరం చేసింది. 2019, డిసెంబర్‌ 6న జరిగిన ఎన్‌కౌంటర్‌ ముందు, తర్వాతి సమయంలో చోటు చేసుకున్న ఘటనల గురించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు అధికారిని కమిషన్‌ వరుసగా రెండో రోజైన శుక్రవారం కూడా విచారించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు సిట్‌ దర్యాప్తు అధికారి సురేందర్‌రెడ్డిని త్రిసభ్య కమిటీ లోతుగా ప్రశ్నించారు.

‘దిశ’సోదరిని కూడా విచారణ కమిషన్‌ చైర్మన్, సభ్యులు విచారించారు. ‘దిశ’ఫోన్‌ సంభాషణ, ఇతరత్రా వివరాలను పూర్తిస్థాయిలో సేకరించారు. అలాగే ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఆరీఫ్‌ తండ్రి హుస్సేన్, నవీన్‌ తల్లి లక్ష్మి, జొల్లు శివ తండ్రి రాజప్ప, చెన్నకేశవులు తల్లి జయమ్మ, భార్య రేణుక.. శుక్రవారం త్రిసభ్య కమిటీ ముందు హాజరయ్యారు. పోలీస్‌ ఎస్కార్ట్‌ వాహనంతో వారిని హైకోర్టు ఆవరణలోకి తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులను విచారించిన కమిషన్‌.. వారి నుంచి సమాచారాన్ని, సాక్ష్యాలను సేకరించింది. ఊర్లో ఉన్నా.. హైదరాబాద్‌లో ఉన్నా.. తమకు పోలీసుల నుంచి ప్రాణహాని, బెదిరింపులు వస్తున్నాయని నిందితుల కుటుంబ సభ్యులు అఫిడవిట్‌ రూపంలో కమిషన్‌ దృష్టికి తీసుకొచ్చారు.  

లాడ్జ్‌ నుంచి బలవంతంగా.. 
వాస్తవానికి కమిషన్‌ విచారణ ఈనెల 26 (గురువారం)న ఉండటంతో నిందితుల కుటుంబసభ్యులు బుధవారం రోజునే హైదరాబాద్‌కు చేరుకొని కాచిగూడలోని ఓ లాడ్జ్‌లో దిగారు. ‘దిశ’కేసు నిందితుల తల్లిదండ్రులు లాడ్జ్‌లో ఉన్నా రని తెలుసుకుని కొందరు పలుమార్లు అక్కడికి వచ్చారని శివ తండ్రి రాజప్ప విలేకర్లకు తెలిపారు. హోటల్‌ యజ మాని తనకు తెలియదని పలుమార్లు చెప్పినా వినకుండా రాత్రి సమయంలో ఫోన్‌ చేసి బెదిరించారన్నారు.

భయాం దోళనకు గురైన హోటల్‌ యజమాని గురువారం రాత్రి తమను బలవంతంగా ఖాళీ చేయించారని పేర్కొన్నారు. విధిలేని పరిస్థితుల్లో ఓ న్యాయవాది ఇంట్లో తలదాచుకున్నామని చెప్పారు. కాగా, విచారణ అనంతరం నిందితుల కుటుంబ సభ్యులను బందోబస్తు మధ్య నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం జక్లేర్, గుడిగండ్ల గ్రామాలకు తీసుకెళ్లి వారి వారి ఇళ్లలో పోలీసులు విడిచిపెట్టారు.

మరిన్ని వార్తలు