VC Sajjanar: పెద్ద సంఖ్యలో ప్రశ్నలు అడగడంతో ప్రెస్‌మీట్‌లో తప్పులు చెప్పా

13 Oct, 2021 16:37 IST|Sakshi

‘దిశ’నిందితులపై సిర్పుర్కర్‌ కమిషన్‌ ప్రశ్నకు సజ్జనార్‌ జవాబు  

కస్టడీ విచారణ రవి గెస్ట్‌ హౌస్‌లో చేస్తున్నట్లు చెప్పలేదు 

కమిషన్‌కు సైబరాబాద్‌ మాజీ సీపీ సజ్జనార్‌ వాంగ్మూలం 

5:16 గం. సుదీర్ఘ విచారణలో 160 ప్రశ్నలు సంధించిన కమిషన్‌ 

సాక్షి, హైదరాబాద్‌: సైబరాబాద్‌ మాజీ పోలీస్‌ కమిషన్‌ వీసీ సజ్జనార్‌ రెండో రోజు మంగళవారం జస్టిస్‌ వీఎస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌ ముందు హాజరయ్యారు. ‘దిశ’నిందితులు మహ్మద్‌ ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులులో ఆరీఫ్‌ మినహా మిగిలిన ముగ్గురు జువెనైల్స్‌ అనే విషయం తనకి తెలియదని కమిషన్‌ ముందు సజ్జనార్‌ వాంగ్మూలం ఇచ్చారు. అలాగే 2019, డిసెంబర్‌ 5 రాత్రి సమయంలో నిందితులను రవి గెస్ట్‌ హౌస్‌లో విచారించమని తాను చెప్పలేదని.. సురక్షిత ప్రదేశంలో మాత్రమే నిందితులను ఉంచాలని సూచించానని వివరించారు.

కేసు దర్యాప్తులో ఉండటం, దిశ వస్తువుల రికవరీ ఉన్నందునే చర్లపల్లి జైలు నుంచి నిందితులను తీసుకెళ్లామని చెప్పారు. ఆ సమయంలో ముద్దాయిలకు సీన్‌ రీ–కన్‌స్ట్రక్షన్‌ సమాచారం ఇవ్వలేదని స్పష్టంచేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసును సాధారణ నేరంగా ఎలా పరిగణించారని, పైగా కేసు విచారణలో ‘మార్నింగ్‌ బ్రీఫింగ్‌’కే పరిమితం అయ్యానని అనడంపై కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. నేరం జరిగిన ప్రాంతానికి అత్యున్నత అధికారిగా ఉంటూ ఎస్‌ఓటీ బృందాల ఏర్పాటు, విచారణ, ఎస్కార్ట్‌ పోలీసులకు ఆయుధాలు, సమాచార సేకరణ, అరెస్ట్‌.. ఇలా ప్రతీదీ మీ కంటే కిందిస్థాయి అధికారి(డీసీపీ ఎన్‌. ప్రకాశ్‌రెడ్డి)కే తెలుసని చెప్పడం సరైందికాదని అసహనం వ్యక్తం చేసింది. 
(చదవండి: పొగాకు వినియోగంలో వారే అధికం.. షాకింగ్‌ విషయాలు వెల్లడి)

కమిషన్‌ ప్రశ్నలలో ప్రధానమైనవి.. 
కమిషన్‌:
నిందితులను అరెస్ట్‌ చేసిన విధానం గురించి శంషాబాద్‌ డీసీపీ మీకు చెప్పారా? 
సజ్జనార్‌: లేదు, చెప్పలేదు. 
కమిషన్‌: స్టేషన్ల స్థాయి ఆయుధాల జారీ, తనిఖీలో అంతిమ బాధ్యత పోలీస్‌ కమిషనర్‌కి ఉండదా?  
సజ్జనార్‌: సైబరాబాద్‌లో ఆయుధాలు, మందుగుం డు సామగ్రి విభాగంతో పాటు ఇతర విభాగాలు కూడా ఉంటాయి. ప్రతి దానికి డీసీపీ ర్యాంక్‌ అధి కారి ఉంటాడు. కమిషనర్‌ లా అండ్‌ ఆర్డర్, పరిపాలన, విధానపరమైన నిర్ణయాలకే పరిమితం అవుతాడు. ఆయుధాల జారీ, తనిఖీలలో ఏమైనా సమ స్యలు తలెత్తితే అది సీపీ దృష్టికి వస్తుంది అంతే. 
కమిషన్‌: నిందితుల నేరాంగీకారం (కన్ఫెషన్‌ స్టేట్‌మెంట్‌) ఎప్పుడు రికార్డ్‌ చేశారు? 
సజ్జనార్‌: మహ్మద్‌ ఆరీఫ్‌ నేరాంగీకార రికార్డ్‌ను సాయంత్రం 5:20గం. నుంచి 6:30గం.ల మధ్య, శివ నేరాంగీకార రికార్డ్‌ 6:45 గం.కు జరిగింది.  
కమిషన్‌: ప్రెస్‌కాన్ఫరెన్స్‌ నిర్వహించే ముందు ఆరీఫ్‌ నేరాంగీకార రికార్డ్‌ను చదివారా? 
సజ్జనార్‌: లేదు, శంషాబాద్‌ డీసీపీ బ్రీఫింగ్‌ చేశారు. 
కమిషన్‌: నిందితులను జ్యుడీషియల్‌ రిమాండ్‌కు త రలించకుండా ప్రెస్‌మీట్‌లో వివరాలెలా చెప్పారు? 
సజ్జనార్‌: ప్రాథమిక సమాచారాన్ని ప్రజలకు తెలి పేందుకే డీసీపీ ఆఫీస్‌లో ప్రెస్‌మీట్‌ నిర్వహించాం. 
కమిషన్‌: ఎఫ్‌ఐఆర్‌ నమోదులో ఆలస్యమెందుకు? 
సజ్జనార్‌: 2019, సెప్టెంబర్‌ 6న ఉదయం 6:20 గం.కు ఎదురుకాల్పుల్లో నిందితులు మరణించా రని శంషాబాద్‌ డీసీపీ తెలిపారు. కానీ, 2గం. ఆలస్యంగా 8:30గం.కు శంషాబాద్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమో దుచేశారు. ఇలా ఎందుకయ్యిందో తెలియదు.  
కమిషన్‌: నిందితుల మరణ సమాచారాన్ని జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ సాయంత్రం 5:30 గంటలకు చెప్పారు. ఎందుకు ఇంత ఆలస్యమైంది? 
సజ్జనార్‌: నాకు తెలియదు. 
కమిషన్‌: చటాన్‌పల్లిలోని సంఘటనా స్థలానికి మీరు ఎప్పుడు వెళ్లారు? ఎంత సేపు ఉన్నారు? 
సజ్జనార్‌: 2019, డిసెంబర్‌ 6న వెళ్లా. గంటన్నరసేపు ఉన్నా. ఆసమయంలో షాద్‌నగర్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌(ఎస్‌హెచ్‌ఓ) శ్రీధర్‌ ఇన్‌చార్జిగా ఉన్నాడు. 
కమిషన్‌: మృతదేహాలపోస్ట్‌మార్టంపై సూచించారా? 
సజ్జనార్‌: లేదు, ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్‌) బృందాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌కు లేఖ రాశాను అంతే. 
కమిషన్‌: ‘దిశ’కనబడటంలేదని కుటుంబ సభ్యులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లినప్పుడు దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? 
సజ్జనార్‌: నలుగురు పోలీసులను సస్పెండ్‌ చేశాం. విచారణ పూర్తయిందో.. లేదో.. తెలియదు.
కమిషన్‌: ఏసీపీ.. నిందితుల మృతదేహాల నుంచి డీఎన్‌ఏ సేకరించిన విషయం మీకు తెలుసా? 
సజ్జనార్‌: నాకు తెలియదు. 
కమిషన్‌: సంఘటన స్థలంలో ప్రెస్‌మీట్‌ కోసం టేబుల్, కుర్చీలు, మైక్‌ ఎవరు ఏర్పాటు చేశారు? 
సజ్జనార్‌: రెండేళ్ల క్రితం జరిగిన సంఘటన కదా గుర్తులేదు. 
కమిషన్‌: మీరు సంఘటన స్థలానికి వెళ్లకముందే అక్కడ టెంట్‌ వేసి ఉందా? 
సజ్జనార్‌: లేదు, మధ్యాహ్నం సమయంలో చూశా. సంఘటన స్థలం నుంచి 100–200 అడుగుల దూరంలో ఏర్పాటు చేశారు. 
2 రోజుల్లో కలిపి సజ్జనార్‌ను 5 గంటల 16 నిమిషాల పాటు కమిషన్‌ విచారణ చేసింది. మొత్తం 160 ప్రశ్నలను త్రిసభ్య కమిటీ అడిగింది. 

ఎన్‌కౌంటర్‌ అంటే ఏంటో నాకు తెలియదు! 
‘మిమ్మల్ని ‘ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌’అని 2019, డిసెంబర్‌ 6న పలు మీడియాల్లో కథనాలు వచ్చాయి. వీటిని ఖండించారా?’అని త్రిసభ్య కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ వీఎస్‌ సిర్పుర్కర్‌ ప్రశ్నించగా.. లేదు అని సజ్జనార్‌ సమాధానం ఇచ్చారు. అంటే మీరు ఇలా సంబోధించడాన్ని ఒప్పుకుంటున్నారా? అని అడగగా.. లేదు అన్నారు. ‘ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌’అంటే ఏంటని మళ్లీ సిర్పుర్కర్‌ ప్రశ్నించగా.. ఏమో దానర్థం ఏంటో నాకు తెలియదని సమాధానం ఇచ్చారు. 

కాల్‌డేటా రికార్డ్స్‌ నోడల్‌ ఆఫీసర్ల విచారణ.. 
సజ్జనార్‌ విచారణ అనంతరం.. దిశ కేసులో పాల్గొన్న పోలీసులు, నిందితుల కాల్‌ డేటా, టవర్స్‌ వివరాలు, లొకేషన్స్‌ గురించి సంబంధిత నెట్‌వర్క్‌ అధికారులను కమిషన్‌ విచారించింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ సబ్‌ డివిజినల్‌ ఇంజనీర్‌ ఎన్‌. శ్రీనివాసులు, రిలయెన్స్‌ జియో నోడల్‌ ఆఫీసర్‌ జితేందర్, వొడా ఫోన్‌–ఐడియా ప్రత్యామ్నాయ నోడల్‌ ఆఫీసర్‌ పీ. జయలక్ష్మి, భారతీ ఎయిర్‌టెల్‌ చీఫ్‌ నోడల్‌ ఆఫీసర్‌ వీ.వెంకటనారాయనన్‌ను కమిషన్‌ తరుఫు న్యాయ వాది విరూపాక్ష దత్తాత్రేయ గౌడ విచారించారు. 

ప్రెస్‌మీట్‌లో తప్పులు చెప్పా.. 
చటాన్‌పల్లిలోని సంఘటన స్థలంలో 2019, డిసెంబర్‌ 6న మధ్యాహ్నం 3 గంటలకు వీసీ సజ్జనార్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. కేసు వివరాలను తెలుగు, హిందీ, ఇంగ్లిష్, కన్నడ నాలుగు భాషల్లో వివరించారు. దిశ వస్తువులు ఫోన్, పవర్‌ బ్యాంక్‌లు పొదల వెనకాల దొరికాయని తెలిపారు. అలాగే అదే ప్రెస్‌మీట్‌లో సీఐ నర్సింహారెడ్డి, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు వినియోగించిన తుపాకుల సేఫ్టీ లాక్స్‌ ఓపెన్‌ చేసి ఉన్నాయా? అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ఎస్‌ ఉన్నాయని చెప్పారు.

అలాగే బాధితురాలు, నిందితుల డీఎన్‌ఏ రిపోర్టులు వచ్చాయని చెప్పారు. వీటిపై కమిషన్‌ ఇవన్నీ ప్రెస్‌మీట్‌లో ఎలా తప్పుగా చెప్పారని ప్రశ్నించింది. ఆ సమయంలో చాలా మంది జనాలు గుమిగూడి ఉన్నారని, పెద్ద సంఖ్యలో మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడుగుతుంటే సడెన్‌గా తప్పుగా చెప్పేశానని కమిషన్‌కు సమాధానం ఇచ్చారు. సంఘటనా స్థలంలో మృతదేహాల పంచనామాలు జరుగుతున్నాయి? వస్తువుల రికవరీ జరుగుతోంది? ఇలాంటి సమయంలో ఆ ప్రాంతంలో ప్రెస్‌మీట్‌ నిర్వహించడం అత్యవసరమని ఎలా అనుకున్నారని త్రిసభ్య కమిటీ అసహనం వ్యక్తం చేసింది.  
(చదవండి: Nalgonda: 4వ శతాబ్దంనాటి మహిషాసురమర్ధిని విగ్రహం గుర్తింపు)

మరిన్ని వార్తలు