జేడీఏ హబీబ్‌బాషా అరెస్టు

6 Aug, 2020 08:01 IST|Sakshi
దిశ పోలీసుస్టేషన్‌లో జేడీఏ హబీబ్‌బాషా

అనంతపురం క్రైం: నిర్భయ కేసులో భాగంగా అగ్రికల్చరల్‌ జేడీఏ హబీబ్‌బాషాను దిశ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం ఉదయం అనంతపురంలోని జేడీఏ ఇంటి వద్ద డీఎస్పీ ఈ.శ్రీనివాసులు నేతృత్వంలో పోలీసులు అరెస్టు చేసి, దిశ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ నెల 3న కళ్యాణదుర్గం అగ్రికల్చరల్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న మహిళా ఉద్యోగిని జేడీఏ హబీబ్‌ బాషా లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఎస్పీ బి.సత్యయేసు బాబుకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో సీసీఎస్‌ డీఎస్పీ, దిశ పోలీసు స్టేషన్‌ ఇన్‌చార్జ్‌ డీఎస్పీ ఈ.శ్రీనివాసులు ఆదేశాలతో పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.  

సుదీర్ఘ విచారణ: 
దిశ పోలీసు స్టేషన్‌లో జేడీఏ హబీబ్‌బాషాను డీఎస్పీ శ్రీనివాసులు సుదీర్ఘంగా విచారించారు. ఉదయం 10 గంటలకు జేడీఏను ఆయన ఇంటి నుంచి స్టేషన్‌కు తరలించారు. లైంగింక వేధింపులకు సంబంధించి లోతుగా ఆరా తీశారు. ‘జూనియర్‌ అసిస్టెంట్‌ తన సొంత పనులపై వచ్చినప్పుడు మీ క్యాబిన్‌కు ఎందుకు పిలిపించి అసభ్యంగా ప్రవర్తించారని? ఆమెకు ఎన్నిసార్లు కాల్‌ చేశారు తదితర విషయాలపై ప్రశ్నించారు. కార్యాలయంలో సిబ్బందితో మాట్లాడితే అసభ్య పదజాలం ఉపయోగించారని బాధితురాలు ఆరోపించిందని, దీనిపై మీరేం సమాధానం చెబుతారంటూ హబీబ్‌బాషాను డీఎస్పీ ప్రశ్నించినట్లు తెలిసింది. హబీబ్‌బాషా కాల్‌ డేటాను పోలీసులు సేకరించి, జూనియర్‌ అసిస్టెంట్‌కు ఫోన్లు ఏమైనా చేశారా? అని ఆరా తీసినట్లు సమాచారం. ఇదిలాఉంటే విచారణలో హబీబ్‌బాషా తనకేం తెలియదని చెప్పినట్లు తెలిసింది. 

మరిన్ని వార్తలు