దిశా రవికి ఒక రోజు పోలీసు కస్టడీ

23 Feb, 2021 02:42 IST|Sakshi
దిశను కోర్టుకు తీసుకొచ్చిన దృశ్యం

న్యూఢిల్లీ: ‘టూల్‌ కిట్‌’ కేసులో ఇటీవల అరెస్ట్‌ అయిన పర్యావరణ పరిరక్షణ మహిళా కార్యకర్త దిశా రవిని ఒక రోజు పోలీసు కస్టడీకి సోమవారం ఢిల్లీలోని చీఫ్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు అనుమతించింది. ఇతర నిందితులతో కలిపి ఆమెను విచారించేందుకు అనుమతించాలని పోలీసులు కోరడంతో మెజిస్ట్రేట్‌ పంకజ్‌ శర్మ ఈ ఆదేశాలిచ్చారు. అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టించిన కేసు ఇదని పోలీసులు కోర్టుకు తెలిపారు. మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు మద్దతుగా చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరిస్తూ రూపొందిన టూల్‌ కిట్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడానికి సంబంధించి దిశా రవితో పాటు నికిత జాకోబ్, శంతను ములుక్‌లపై ఢిల్లీ పోలీసులు దేశద్రోహం సహా ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఎవరితో కలిపి తనను విచారించాలని పోలీసులు చెబుతున్నారో.. ఆ సహనిందితులు ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారని, పోలీసు కస్టడీలో లేరని, అలాంటప్పుడు తన కస్టడీని పోలీసులు ఎలా కోరుతారని దిశా రవి మెజిస్ట్రేట్‌ దృష్టికి తీసుకువచ్చారు. జ్యూడీషియల్‌ కస్టడీలో ఉంచి కూడా సహ నిందితులతో కలిపి తనను విచారించే అవకాశం ఉందని వాదించారు. మరోవైపు, దిశా రవి బెయిల్‌ పిటిషన్‌ సెషన్స్‌ కోర్టులో పెండింగ్‌లో ఉందని, మంగళవారం దానిపై తీర్పు వెలువడనుందని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.   
 

మరిన్ని వార్తలు