రిమాండ్‌కు ‘ఈబిడ్‌’ సూత్రధారి సునీల్‌

8 Sep, 2021 02:43 IST|Sakshi
వైద్యపరీక్షల అనంతరం సునీల్‌ను రిమాండ్‌కు తీసుకెళ్తున్న పోలీసులు

నాగపూర్‌ నుంచి పీటీ వారెంట్‌పై కడియాల సునీల్‌ను అనంతపురం తీసుకువచ్చిన సీఐడీ 

వర్చువల్‌ విధానంలో జిల్లా జడ్జి విచారణ

అనంతపురం క్రైం: అనంతపురం జిల్లాలో సంచలనం రేకెత్తించిన ఈబీఐడీడీ (ఈబిడ్‌) స్కామ్‌ సూత్రధారి కడియాల సునీల్‌ అలియాస్‌ మాథ్యూ అలియాస్‌ తినువత్తా సునీల్‌ కడియాల కటకటాలపాలయ్యాడు. ఇతన్ని మంగళవారం సీఐడీ డీఎస్పీ పూజిత ఆధ్వర్యంలో పోలీసులు కర్నూలు నుంచి అనంతపురం తీసుకువచ్చారు. రూరల్‌ పోలీసుస్టేషన్‌ నుంచి బ్లూజీన్‌ యాప్‌ ద్వారా వర్చువల్‌ విధానంలో జిల్లా జడ్జి అరుణ సారిక ముందు హాజరుపరిచారు. ఈ నెల 21 వరకు రిమాండ్‌ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. అంతకుముందు సునీల్‌కు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. 

ఇదీ నేపథ్యం..
ఈబిడ్‌ నిర్వాహకులు అధిక వడ్డీ ఇస్తామని ఆశచూపి రూ.28 లక్షలు కట్టించుకుని మోసం చేశారని ధర్మవరం మండలం వసంతపురానికి చెందిన ఎం. బాబుల్‌రెడ్డి ఈ ఏడాది ఏప్రిల్‌ 14న ధర్మవరం రూరల్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కడియాల సునీల్, జాస్తి సుధాకర్, మహేంద్ర చౌదరిలపై పోలీసులు ఐపీసీ సెక్షన్‌–420, 34 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అలాగే, ఈ ఏడాది మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ బజాజ్‌నగర్‌ పీఎస్‌లో నమోదైన ఓ చీటింగ్‌ కేసులో అక్కడి కోర్టు సునీల్‌కు రిమాండ్‌ విధించింది. ఈబిడ్‌ కేసు సీఐడీకి బదిలీ కావడంతో పోలీసులు గత నెల 27న జిల్లా కోర్టులో పీటీ వారెంట్‌ తీసుకుని ఈ నెల 6న నాగ్‌పూర్‌ జైలు నుంచి సునీల్‌ను కర్నూలుకు తీసుకువచ్చి మంగళవారం అనంతపురం జిల్లా జడ్జి ముందు హాజరుపర్చారు. ఇదే కేసులో మహేంద్ర చౌదరి ఇప్పటికే రిమాండ్‌లో ఉన్నాడు. 

కడియాలపై మరో 15 కేసులు?
కడియాల సునీల్‌పై జిల్లాలో మరో 15 కేసులు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఒక కేసులో మాత్రమే కోర్టు రిమాండ్‌ విధించింది. మిగిలిన కేసులకు సంబంధించి కూడా పోలీసులు చార్జిషీట్‌ దాఖలు చేయనున్నారు. అలాగే, రిమాండ్‌లో ఉన్న కడియాల సునీల్‌ను విచారణ నిమిత్తం సీఐడీ పోలీసులు బుధవారం కస్టడీకి కోరనున్నట్లు తెలిసింది. ఈ విచారణలో ఈబిడ్‌ అక్రమాలు మరిన్ని వెలుగుచూసే అవకాశం ఉంది. ఈ స్కామ్‌లో సునీల్‌ వెనుక ఎవరెవరు ఉన్నారన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టనున్నారు.

మరిన్ని వార్తలు