దివ్య తేజస్విని హత్యకేసు: నాగేంద్రకు 14 రోజులు రిమాండ్‌

7 Nov, 2020 14:41 IST|Sakshi
మృతురాలు దివ్య తేజస్విని(ఫైల్‌ ఫొటో)

సాక్షి, విజయవాడ: ఇంజనీరింగ్‌ విద్యార్థిని దివ్య తేజస్విని హత్యకేసులో అరెస్టైన నిందితుడు నాగేంద్రను మొదటి చీఫ్‌ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో పోలీసులు నేడు హాజరుపరిచారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఎస్‌. కమలాకర్‌రెడ్డి అతడికి 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో పోలీసులు, నాగేంద్రను మచిలీపట్టణం సబ్ జైలుకు తరలించారు. అక్కడ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. కాగా కోర్టులో హాజరుపరచడానికి ముందు నాగేంద్రకు ఈఎస్‌ఐ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. బీపీ, షుగర్, ఈసీజీతో పాటు కోవిడ్‌-19 టెస్టు కూడా చేయించారు. ఇక దివ్య తేజస్విని హత్య సమయంలో తాను గాయాలపాలైన విషయాన్ని నాగేంద్ర ఈ సందర్భంగా వైద్యులకు చెప్పాడు. (చదవండి: ప్రేమోన్మాది నాగేంద్రబాబు అరెస్ట్‌)

కాగా విజయవాడలోని క్రీస్తురాజపురం కొండ ప్రాంతానికి చెందిన వంకాయలపాటి దివ్య తేజశ్విని(22)ని అదే ప్రాంతానికి చెందిన బుడిగి నాగేంద్రబాబు కత్తితో పొడిచి హతమార్చిన విషయం విదితమే. దిశ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దిశ పోలీసులు పకడ్బందీగా కేసును దర్యాప్తు చేసి ఆధారాలు సేకరించారు. నాగేంద్ర వెల్లడించిన వివరాల ప్రకారం, అతడి ఆరుగురు స్నేహితులను కూడా ప్రత్యేక బృందం విచారించనుంది. ఈ కేసులో ఇప్పటికే 45 మంది సాక్షుల నుంచి వివరాలు సేకరించి చార్జిషీట్ దాఖలు చేశారు.

మరిన్ని వార్తలు