కరోనాతో డాక్టర్‌ మృతి; ఎయిర్‌లిఫ్టు చేయాలని భావించినా

26 Nov, 2020 08:25 IST|Sakshi

భోపాల్‌: కరోనా రోగులకు చికిత్స అందించే క్రమంలో మహమ్మారి బారిన పడిన ఓ యువ వైద్యుడు కన్నుమూశాడు. నెలరోజుల పాటు ప్రాణాంతక వైరస్‌తో పోరాడి బుధవారం తుదిశ్వాస విడిచాడు. కోవిడ్‌ ప్రభావంతో ఊపిరితిత్తులు పాడైపోవడంతో విమానంలో చెన్నైకి తరలించి అవయవ మార్పిడి చేయాలని భావించగా నివర్‌ తుపాను ఇందుకు అడ్డంకిగా నిలిచింది. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. శుభం ఉపాధ్యాయ్‌(30) బుంధేల్‌ఖండ్‌ మెడికల్‌ కాలేజీలో కాంట్రాక్ట్‌ డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. కోవిడ్‌ పేషెంట్లకు చికిత్స అందిస్తున్న తరుణంలో అక్టోబరు 28న అతడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. (చదవండి: 50 ఏళ్లు దాటిన వారికే తొలి టీకా)

దీంతో భోపాల్‌లోని చిరాయు మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి తరలించగా నవంబరు 10న శుభం ఆరోగ్యం క్షీణించింది. ఊపిరితిత్తులు చెడిపోవడంతో అవయవ మార్పిడి చేయాలని, ఇందుకోసం చెన్నై ఆస్పత్రికి ఎయిర్‌లిఫ్టు చేయాలని భావించగా నివర్‌ తుపాను కారణంగా అది వీలుపడలేదని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో కోవిడ్‌ వారియర్‌ను కోల్పోయామంటూ విచారం వ్యక్తం చేశాయి. కాగా శుభం పరిస్థితి తెలుసుకున్న ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అతడిని చెన్నై తరలించే ఏర్పాట్లు చేయమని అధికారులను ఆదేశించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇక మధ్యప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. మంగళవారం రాష్ట్రంలో కొత్తగా 1766 కోవిడ్‌ కేసులు వెలుగుచూశాయి. 11 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.(చదవండి: రాత్రిపూట కర్ఫ్యూ విధించొచ్చు)

మరిన్ని వార్తలు