సోఫాలో సుప్రియ ఆంటీ డెడ్‌బాడీ: ఎట్టకేలకు వీడిన మిస్టరీ.. కామపిశాచిని కాళ్ల చెప్పులే పట్టించాయి!!

19 Feb, 2022 18:35 IST|Sakshi

డోంబివిలి(థానే.. ముంబై)లో కలకలం రేపిన సుప్రియ ఆంటీ హత్య మిస్టరీ ఎట్టకేలకు వీడింది. కిరాతకంగా హత్య చేసి.. ఆపై మృతదేహాన్ని సోఫా కమ్‌ బెడ్‌లో కుక్కేసి వెళ్లిపోయాడు నిందితుడు. ఈ ఘటన మహారాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించగా.. పోలీసులు నిందితుడిని చాకచక్యంగా పట్టుకోగలిగారు. ఈ కేసును చేధించడంలో నిందితుడి చెప్పులే కీలకంగా వ్యవహరించాయి.  


ముంబై: దావ్ది ఏరియా డొంబివిలో సంచలనం సృష్టించిన 33 ఏళ్ల గృహిణి హత్య కేసులో నిందితుడిని ఎట్టకేలకు  మాన్‌పాడా పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. సుప్రియ భర్త క్లోజ్‌ఫ్రెండ్‌, ఆమె పొరుగింటి వ్యక్తి విశాల్‌ గెహావత్‌ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు ధృవీకరించారు. సీసీ కెమెరాలు లేకపోవడంతో ఈ కేసులో దర్యాప్తు కష్టతరంగా మారింది. అయితే ఘటన జరిగిన రోజున(మంగళవారం), అంతకు ముందు రోజు నిందితుడు బాధితురాలి ఇంటి బయట చెప్పులు విడిచాడు. మరో పక్కింట్లో ఉండే మహిళ ఆ చెప్పుల ఆనవాళ్లు వివరించగా.. ఆ చిన్న క్లూతో నిందితుడిని ట్రేస్‌ చేయడం మొదలుపెట్టారు. అవి సుప్రియ భర్త కిషోర్ ఫ్రెండ్‌‌, పక్కఇంట్లో ఉండే విశాల్‌కి చెందినవిగా తేలడంతో.. తమదైన శైలిలో పోలీసులు ప్రశ్నించారు. దీంతో నిందితుడు నిజం ఒప్పేసుకున్నాడు.

లొంగలేదనే కోపంలో.. 
నిందితుడు విశాల్‌ వెల్లడించిన వివరాల ప్రకారం..  విశాల్‌, సుప్రియ భర్త కిషోర్‌ షిండేలు చాలాకాలం నుంచి స్నేహితులు. కానీ, స్నేహితుడి భార్యపైనే విశాల్ కన్నేశాడు. కావాలనే కిషోర్‌ వాళ్ల పక్కింట్లోనే అద్దెకు దిగాడు. ఎలాగైనా సుప్రియను లోబర్చుకోవాలని ప్రయత్నించాడు. అయితే ఆమె అతన్ని పట్టించుకోలేదు. సుప్రియకు పుస్తకాలు చదివే అలవాటు ఉంది. ఆ వంకతో ఆమెకు దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. ఘటన జరిగిన ముందురోజు కూడా పుస్తకం కోసం సుప్రియ ఇంట్లోకి వెళ్లాడు విశాల్‌.


భర్త కిషోర్‌, కొడుకుతో సుప్రియ

ఆ టైంకి సుప్రియ భర్త ఆఫీసుకి, కొడుకు స్కూల్‌కి వెళ్లడం గమనించాడు. ఆ మరుసటి రోజూ సుప్రియ ఒంటరిగా ఉన్న టైంలో తలుపు తట్టాడు. పుస్తకం కావాలంటూ సుప్రియతో మాటలు కలిపి తన కోరికను బయటపెట్టాడు. దీంతో ఆమె అతని చెంప చెల్లుమనిపించింది. కోపంతో ఆమెను బలవంతం చేయాలని ప్రయత్నించాడు. ప్రతిఘటించేసరికి తల నేలకేసి బాది.. ఆపై నైలాన్‌ తాడును సుప్రియ మెడకు బిగించి దారుణంగా హత్య చేశాడు.

ఆపై శవాన్ని సోఫా కమ్‌ బెడ్‌లో కుక్కేసి.. అక్కడి నుంచి జారుకున్నాడు. కొడుకును స్కూల్‌ నుంచి తీసుకెళ్లేందుకు ఆమె ఎంతకీ రాకపోవడంతో.. సుప్రియ కోసం వెతుకులాట మొదలైంది. కుటుంబ సభ్యులంతా సుప్రియ కోసం గాలిస్తున్న టైంలోనూ ఏమీ ఎరగనట్లు కిషోర్‌ పక్కనే ఉన్నాడు విశాల్‌. సుప్రియ ఎంతకీ కనిపించకపోయేసరికి కిషోర్‌తో కలిసి మరీ పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి మిస్సింగ్‌ కంప్లయింట్‌ ఇచ్చి వచ్చాడు. ఈ లోపు సోఫా కుషన్‌ చినిగి ఉండడం అనుమానించిన చుట్టుపక్కల వాళ్లు.. పైకి ఎత్తి చూడగా అందులో నుంచి సుప్రియ షిండే మృత దేహం బయటపడింది.

మరిన్ని వార్తలు