ఐదేళ్లుగా నమ్మకంగా ఉంటున్నాడని ఇంటి తాళమిచ్చిన యజమాని.. రూ.10కోట్లతో చెక్కేసిన వ్యక్తి

29 Jul, 2022 17:05 IST|Sakshi

న్యూఢిల్లీ: ఐదేళ్లుగా ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్నాడని తాళం అతనికే అప్పగించి అమెరికా వెళ్లాడు ఓ యజమాని. తీరా అతనే దొంగతనానికి పాల్పడి రూ.10కోట్లు దోచుకెళ్లాడని తెలిసి షాక్‌కు గురయ్యాడు. వెంటనే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పశ్చిమ ఢిల్లీలోని పంజాబీ బాగ్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

ఈ కేసులో దొంగతనానికి పాల్పడిన నిందితుని పేరు మోహన్ కుమార్(26). ఐదేళ్లుగా నమ్మకంగా ఉంటున్నాడని అతని ఇంటి యజమాని తాళాలు అప్పగించి కుటుంబంతో అమెరికా వెళ్లాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఇంట్లో పనిచేసే మరో వ్యక్తి యజమానికి ఫోన్ చేశాడు. మోహన్‌ కుమార్ ఇంట్లో దొంగతనం చేశాడని, డబ్బు, నగలతో పారిపోయాడని తెలియజేశాడు. వెంటనే యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. మోహన్‌ ఇంట్లో నుంచి సూట్‌కేసుతో కారులో పారిపోతున్నట్లు అందులో రికార్డు ఉయ్యింది. అతనితో పాటు మరో మైనర్ కూడా ఉన్నాడు.

విచారణ చేపట్టిన పోలీసులు మొదట మైనర్ జాడ కనుగొన్నారు. అతడు మోహన్ బంధువని, బిహార్‍లోని శివహర్‌ జిల్లాలో ఉంటున్నాడని తెలుసుకున్నారు. వెంటనే అక్కడికి వెళ్లి బాలుడ్ని ఆదివారం అరెస్టు చేశారు. అతడు చెప్పిన వివరాలతో  మోహన్‌ను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. మోహన్ బంధువు మైనర్ అయినందున అతడ్ని జువెనైల్ హోంకు తరలించారు.

మోహన్ దొంగతనం చేసిన డబ్బులు, నగలు, వజ్రాల మొత్తం విలువ రూ.10కోట్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. వీటిలో కొంతమాత్రమే  స్వాధీనం చేసుకున్నామని, మిగతా మొత్తం ఎక్కుడుందో తెలుసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
చదవండి: ముసుగు దుండగుల దాడి.. మంగళూరులో దారుణ హత్య.. 144 సెక్షన్‌ విధింపు

మరిన్ని వార్తలు