ఆడపిల్ల జన్మించిందని అదనపు కట్నం కావాలట...

2 May, 2021 12:55 IST|Sakshi

సాక్షి, భీమదేవరపల్లి(వరంగల్‌ అర్బన్‌): ఆడ పిల్ల జన్మించడంతో అదనపు కట్నం కావాలంటూ తన భర్త వేధిస్తూ ఏడేళ్లుగా తనకు దూరంగా ఉంటున్నాడని ఓ మహిళ ఆరోపించారు. ఈ మేరకు భీమదేవరపల్లి మండలం రసూల్‌పల్లికి చెందిన కన్నెబోయిన రమ్య తన భర్త తిరుపతి ఎదుట శనివారం నిరసనకు దిగింది. బాధితురాలి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. 2014లో రసూల్‌పల్లికి చెందిన తిరుపతితో రమ్యకు పెద్దలు వివాహం జరిపించారు.

ఏడాది అనంతరం పాప జన్మించడంతో తన భర్త అత్త, మామ అదనపు కట్నం తేవాలంటూ వేధించడం ఆరంభించారు. పలుమార్లు పోలీస్‌స్టేషన్, కోర్టు చుట్టూ తిరిగిన ప్రయోజనం లేదని వాపోయింది. అయితే, భర్త నుంచి విడిపోవడం ఇష్టం లేకే ఆయన ఇంటి ఎదుట నిరసనకు దిగినట్లు వివరించింది. ఈ నిరసనలో రమ్య వెంట కుమార్తె ఆరాధ్య, తల్లితండ్రులు, బంధువులు కూడా పాల్గొన్నారు. కాగా, కేసు కోర్టులో ఉన్నందున తీర్పు ప్రకారం నడుచుకుంటానని తిరుపతి వివరణ ఇచ్చారు.  

మరిన్ని వార్తలు