డాక్టర్‌ నమ్రత మరో అక్రమ ‘కోణం’ 

11 Aug, 2020 08:24 IST|Sakshi
డాక్టర్‌ నమ్రత అగ్రిమెంట్‌ చేయించిన పత్రాలను చూపుతున్న బాధితులు మల్లికార్జున, వెంకట నరసమ్మ

తిరుపతి వాసులకూ టోకరా 

భూవిక్రయాల పేరుతో లక్షల వసూళ్లు 

న్యాయం చేయాలంటూ లబోదిబోమంటున్న బాధితులు 

డాక్టర్‌ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న వైనం

సాక్షి, తిరుపతి‌: శిశువులను విక్రయిస్తూ పట్టుబడిన విశాఖపట్నం సృష్టి ఆస్పత్రి అధినేత డాక్టర్‌ పి.నమ్రత అక్రమాలు ఒక్కొక్కటీ బయట పడుతున్నాయి. శిశువులతో వ్యాపారమే కాకుండా రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్లతో చేతులు కలిపి భూలావాదేవీల్లోనూ అక్రమాలకు పాల్పడి ప్రజల నుంచి భారీ ఎత్తున నగదు దోచుకున్నట్లు వెలుగుచూసింది. తిరుపతి పద్మావతీపురానికి చెందిన రిటైర్డ్‌ టీచర్‌ మల్లికార్జున్, వెంకటనరసమ్మ దంపతుల దగ్గర రెండు ఎకరాల భూమిని విక్రయిస్తానంటూ సుమారు రూ.27 లక్షలు కాజేసి మోసం చేసిందని బాధితులు సోమవారం ‘సాక్షి’ కార్యాలయానికి వచ్చి గోడు వెళ్లబుచ్చారు. కర్ణాటక రాష్ట్రం చిక్‌బళ్లాపూర్‌కు చెందిన రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌ చలపతి ద్వారా తమకు డాక్టర్‌ నమ్రత పరిచయమైందన్నారు.

2008లో చిక్‌బళ్లాపూర్‌ ప్రాంతంలో ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న రూ.58లక్షలు విలువజేసే రెండు ఎకరాల భూమిని విక్రయిస్తానని చెప్పి అడ్వాన్స్‌ చెల్లించి అగ్రిమెంట్‌ చేసుకోవాలని నమ్మబలికిందని, 2008 జనవరిలో వడ్డీకి అప్పు తెచ్చి రూ.27లక్షలు డాక్టర్‌ నమ్రతకు చెల్లించి అగ్రిమెంట్‌ చేసుకున్నామని చెప్పారు. రిజిస్ట్రేషన్‌కు సమయం ఉండటంతో తమ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండగా 2010లో మళ్లీ తమను సంప్రదించి నిర్ణయించిన ధరకంటే అదనంగా రూ.10 లక్షలు చెల్లించాలని డిమాండు చేసిందని పేర్కొన్నారు. ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చి సదరు భూమి వివరాలపై ఆరా తీయగా తమకు అగ్రిమెంట్‌ చేయించిన భూమిని 2008 మే నెలలో వేరేవారికి విక్రయించినట్లు తెలిసిందన్నారు.  (పేగుబంధంతో పైసలాట!)

ఈ విషయమై నిలదీయగా బెదిరింపులకు దిగిందని చెప్పారు. అప్పటి నుంచి 2014 వరకు పెద్ద మనుషుల పంచాయితీలతో కాలం గడిపిందని, 2015లో తాము హైదరాబాద్, విజయవాడ, చిక్‌బళ్లాపూర్‌లోని పోలీస్టేషన్లలో ఫిర్యాదు చేశామని తెలిపారు. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ నాయకులతో కుమ్మక్కై కేసులను నీరుగార్చే ప్రయత్నాలు చేస్తూ మానసిక క్షోభకు గురిచేసిందన్నా రు. ప్రభుత్వం, అధికారులు కలుగజేసుకుని న్యాయం చేయాలని కోరారు. 

మరిన్ని వార్తలు