రోడ్డు ప్రమాదంలో డాక్టర్‌ ఎస్‌.పి.నాయుడు మృతి 

4 Oct, 2022 13:27 IST|Sakshi
డాక్టర్‌ ఎస్‌.పి.నాయుడు (ఫైల్‌)  

సాక్షి, శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ప్రముఖ వైద్యుడు, సేవా తత్పరుడు డాక్టర్‌ ఎస్‌.పి. నాయుడు (67) రోడ్డు ప్రమాదంలో మృతి   చెందారు. సతీమణి సత్యవతి, అల్లుడు ఆర్యతో కలిసి నాయుడు శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం కారులో వెళ్తుండగా శనివారం రాత్రి చోడమ్మ అగ్రహారం సమీపంలో ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి వద్ద లారీని ఢీకొట్టారు. స్వల్ప గాయాలతో భార్య, అల్లుడు బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన నాయుడును 108 వాహనంలో కిమ్స్‌కి తీసుకొచ్చి వైద్యం అందించినా ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని శ్రీకాకుళం రెండో పట్టణ పోలీసులకు తెలియజేయగా వారు పూసపాటిరేగ పోలీస్‌స్టేషకు సమాచారం అందించి కేసు నమోదు చేశారు.

నాయుడు స్వగ్రామం సంతకవిటి మండలం మేడమర్తి.  పాలకొండ, రాజాం, విశాఖపట్నంలలో పలు ఆస్పత్రుల్లో వైద్యసేవలందించారు. ఈయన పిల్లలు రవితేజ, శ్రీజ, కోడలు సౌమ్య కూడా వైద్యులుగా సేవలందిస్తున్నారు. ఆదివారం శ్రీకాకుళం నగరంలో ఎస్‌.పి.నాయుడు కన్వెన్షన్‌ హాల్‌ వద్ద అంత్యక్రియలు నిర్వహించారు. వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పిరియా విజయసాయిరాజ్, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్‌ కిల్లి కృపారాణి, పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి, స్పీకర్‌ తమ్మినేని సీతారాం సంతాపం తెలియజేశారు.  

మరిన్ని వార్తలు