పొరుగింటి లాయర్‌పై కక్షతో..

19 Dec, 2021 05:37 IST|Sakshi

రోహిణి కోర్టులో బాంబు పెట్టిన డీఆర్‌డీవో శాస్త్రవేత్త

అరెస్ట్‌ చేసిన ఢిల్లీ పోలీసులు

న్యూఢిల్లీ: పొరుగింట్లో ఉండే లాయర్‌పై కక్ష పెంచుకుని, అతడిని చంపేందుకు ఢిల్లీలోని రోహిణి జిల్లా కోర్టులో టిఫిన్‌ బాక్స్‌ బాంబు పెట్టిన డీఆర్‌డీవో (రక్షణ, పరిశోధనాభివృద్ధి సంస్థ) సీనియర్‌ శాస్త్రవేత్త ఒకరిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. డీఆర్‌డీవో సీనియర్‌ సైంటిస్ట్‌ భరత్‌ భూషణ్‌ కటారియా (47), లాయర్‌గా పనిచేసే అమిత్‌ వశిష్ట్‌ స్థానిక అశోక్‌ విహార్‌ ఫేజ్‌–1 భవనంలోని వేర్వేరు అంతస్తుల్లో నివసిస్తున్నారు. పాత తగాదాలున్న వీరిద్దరూ పరస్పరం పలు కేసులు పెట్టుకున్నారు. అయితే, లాయర్‌ వశిష్ట్‌ను చంపాలని కటారియా ప్రణాళిక  వేశాడు. మార్కెట్‌లో సులువుగా దొరికే రసాయనాలను వాడి టిఫిన్‌ బాక్స్‌ బాంబు తయారు చేశాడు.

ఈ నెల 9వ తేదీన కటారియా లాయర్‌ మాదిరి దుస్తులు వేసుకుని ఎవరికీ అనుమానం రాకుండా రోహిణి కోర్టు భవనంలో వశిష్ట్‌ హాజరయ్యే కోర్ట్‌ నంబర్‌ 102లో బాంబున్న బ్యాగ్‌ను వదిలేసి వచ్చాడు. కానీ, సరిగ్గా అమర్చని కారణంగా బాంబు బదులు డిటొనేటర్‌ మాత్రమే పేలింది. దీంతో ఒకరు గాయపడ్డారు. దర్యాప్తు చేపట్టిన విచారణ బృందాలు..ఘటన జరిగిన రోజున కోర్టు సీసీ ఫుటేజీని పరిశీలించి కటారియానే బాధ్యుడిగా తేల్చాయి. బాంబు తయారీలో వాడిన సామగ్రి, రసాయనాలు, రిమోట్‌ తదితరాలు కటారియా ఇంట్లో లభించాయి. ఈ మేరకు శాస్త్రవేత్త భరత్‌ భూషణ్‌ కటారియాను శనివారం అరెస్ట్‌ చేశామని ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ రాకేశ్‌ ఆస్తానా తెలిపారు.

మరిన్ని వార్తలు