కారులో 260 బంగారు బిస్కెట్లు.. తీయడానికి 18 గంటలు

19 Jun, 2021 14:24 IST|Sakshi

మణిపూర్‌: దేశంలో ఓ వైపు కరోనా వైరస్‌ వల్ల ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. దీంతో చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. కానీ ఇవేవి అక్రమార్కులను అడ్డుకోలేక పోతున్నాయి. తాజాగా మణిపూర్‌లోని ఇంఫాల్‌లో రూ.21 కోట్ల విలువైన 43 కిలోల బంగారు బిస్కెట్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలో  ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్న కారుని పోలీస్‌ అధికారులు మంగళవారం తనిఖీ చేయడానికి నిలిపారు. అయితే వారిని ప్రశ్నించిన తర్వాత అనుమానం రావడంతో.. కారులో క్షుణ్ణంగా తనఖీలు చేశారు.

కారులోని వేరు వేరు ప్రదేశాల్లో బంగారు బిస్కెట్లు దాచినట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కారులో వివిధ చోట్ల దాచిన 260 విదేశీ బంగారు బిస్కెట్లను బయటకు తీయడానికి అధికారులకు 18 గంటల సమయం పట్టింది. గతంలో కూడా ఇదే వాహనాన్ని అక్రమ రవాణాలకు ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు. ఇక గత మూడు నెలల్లో గౌహతి జోనల్ యూనిట్ మయన్మార్ సెక్టార్ నుంచి రూ. 33 కోట్లకు పైగా విలువైన 67 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

ఈ మొత్తంలో కేవలం జూన్‌లోనే 55 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కాగా ఇండియా, మయన్మార్ సరిహద్దు మీదుగా బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరింత కట్టుదిట్టమైన తనిఖీ ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
చదవండి: 123 రోజులు సంకెళ్లతో.. ప్రపంచంలో ఏ జంట ఈ పని చేసుండదు?

మరిన్ని వార్తలు