రూ. 2,000 కోట్ల హెరాయిన్‌ పట్టివేత

6 Jul, 2021 16:20 IST|Sakshi

ముంబై: ఇరాన్ నుంచి సముద్రం ద్వారా ముంబైలోకి అక్రమంగా రవాణా చేస్తున్న 293.81 కిలోలు, అంతర్జాతీయ మార్కెట్‌లో రూ. 2,000 కోట్ల విలువ చేసే హెరాయిన్‌ను రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ సరుకును నవీ ముంబైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఓడరేవు నుంచి రహదారి ద్వారా పంజాబ్‌కు రవాణా చేయాల్సి ఉంది, ఈ క్రమంలో అక్కడ అధికారులు దీనిని అడ్డుకుని ఆరు గన్నీ సంచుల్లో ఉన్న హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. డీఆర్‌ఐ ప్రకారం.. జప్తు చేసిన హెరాయిన్‌ను టాల్కమ్‌ రాళ్లతో రెండు కంటైనర్లలో దాచినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పంజాబ్‌లోని తరన్ టార్న్ ప్రాంతానికి చెందిన ప్రభుజిత్ సింగ్ అనే సరఫరాదారుని మధ్యప్రదేశ్‌కు చెందిన మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

గత వారం జూన్ 28న ఢిల్లీ విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు ఇద్దరు దక్షిణాఫ్రికా పౌరుల నుంచి రూ.126 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.అంతే కాకుండా గత ఆరు నెలల్లో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు రూ.600 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అక్కడి అధికారులు సోమవారం వెల్లడించారు. గత ఏడాది ఆగస్టులో ముంబై కస్టమ్స్, డీఆర్‌ఐ  అధికారులు జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్‌లోని కార్గో కంటైనర్ నుంచి  రూ.1,000 కోట్ల విలువైన 191 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ సరుకు ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి దేశంలోకి అక్రమంగా రవాణా చేసినట్లు అధికారులు అనుమానం వ్యక్త చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు