ఆ రెండూ దొరక్కపోవడంతో... 

13 Aug, 2020 09:31 IST|Sakshi

నగర వ్యాప్తంగా మాదకద్రవ్యాల క్రయవిక్రయాలు, వినియోగంపై నిఘా ముమ్మరమైంది. ఓ వైపు పోలీసులు, మరో వైపు ఎక్సైజ్‌ అధికారులు ఎడాపెడా దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మత్తుకు బానిసైన యువకులు ‘సేఫ్‌ డ్రగ్స్‌’ వినియోగానికి మొగ్గుచూపుతున్నారు. వీరితో పాటు ఫుట్‌పాత్‌లపై బతికే అనాథలు సైతం వీటిని వినియోగిస్తున్నారు. 

సాక్షి, సిటీబ్యూరో: మత్తు కోసం ‘సేఫ్‌ డ్రగ్స్‌’ వినియోగం అధికం అవుతున్న నేపథ్యంలో నగర పోలీసు విభాగం ఈ దందాపై కన్నేసింది. అందులో భాగంగా సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శుక్రవారం హిమాయత్‌నగర్‌కు చెందిన జయంత్‌ అగర్వాల్‌ను అరెస్టు చేశారు. ఇతడి నుంచి 154 బాటిళ్ల దగ్గుమందు స్వాధీనం చేసుకున్నారు.  

ఆ రెండూ దొరక్కపోవడంతో... 
మాదకద్రవ్యాలు.. ఇతరత్రా ఖరీదైన డ్రగ్స్‌ కొనలేని ‘మత్తు బానిసలు’ ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ‘ఆల్టర్నేటివ్‌ డ్రగ్స్‌’లో నిద్రమాత్రలు, వైట్నర్, దగ్గు మందు ప్రధానమైనవిగా మారాయి. అయితే వైద్యులు రాసిన ప్రిస్క్రెప్షన్‌ లేకుండా స్లీపింగ్‌ పిల్స్‌ను ఖరీదు చేయడం కష్టసాధ్యం. వైట్నర్‌ను ఖరీదు చేయడం తేలికే అయినా వినియోగించేప్పుడు ఇతరుల దృష్టిలో పడే అవకాశాలు ఉంటాయి. దీంతో అత్యధికంగా ప్లాట్‌ఫామ్స్‌పై నివసించే అనాథలే దీన్ని ఎక్కువగా వాడుతున్నారు. మత్తుకు బానిసవుతున్న యువత, వైట్నర్‌ లభించని అనాథలు దగ్గు మందు ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీరికి ఈ మందులు మెడికల్‌ దుకాణాల నుంచే లభిస్తున్నాయి. 

దగ్గు కరోనా లక్షణాల్లో ఒకటైనా... 
నగరంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఎలాంటి లక్షణాలు లేని అసిమ్టమ్యాటిక్‌ కేసులతోపాటు ఈ వైరస్‌ సోకిన వారు క్వారంటైన్‌ నిబంధనల్ని ఉల్లంఘించడం, లక్షణాలున్నా కోవిడ్‌ అని గుర్తించలేక కొన్ని మందులు వాడుతూ బయట సంచరించడం కూడా కారణాలనే వైద్యులు చెబుతున్నారు. కరోనా లక్షణాల్లో దగ్గు కూడా ఒకటి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం గతంలోనే కీలక ఆదేశాలు జారీ చేసింది. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి వాటికి మెడికల్‌ షాపుల యజమానులు నేరుగా మాత్రలు అమ్మవద్దని, అమ్మినా ఖరీదు చేసిన వారి వివరాలు వైద్య ఆరోగ్య శాఖకు తెలపాలని స్పష్టం చేసింది. అయినా కొందరు మెడికల్‌ షాపుల యజమానులు మత్తుకు బానిసైన వారికి దగ్గు మందు విక్రయించేస్తున్నారు. దారుస్సలాంలో అగర్వాల్స్‌ ఫార్మసీ నిర్వహిస్తున్న హిమాయత్‌నగర్‌కు చెందిన జయంత్‌ అగర్వాల్‌ ఈ మందుల్ని అధిక ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటూ శుక్రవారం సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌కు చిక్కాడు. 

శృతిమించితే తీవ్ర పరిణామాలే... 
అత్యధిక శాతం దగ్గు మందుల్ని డెక్స్‌ట్రోమెథార్ఫిన్, కోడైన్‌లతో తయారు చేస్తారు. కోడైన్‌తో కూడిన ఈ రసాయనం నియంత్రిత జాబితాలో ఉన్న మాదకద్రవ్యం. మత్తును కలిగించే దీన్ని కేవలం ఔషధాల తయారీకి మాత్రమే వినియోగిస్తుంటారు. ప్రధానంగా డెక్స్‌ట్రోమెథార్ఫిన్‌ కారణంగానే అనేక మంది దగ్గు మందులకు బానిసలు అవుతున్నారు. ఇది శృతిమించితే కిడ్నీ, కాలేయానికి సంబంధించిన వ్యాధులు వస్తాయి. గుండె కొట్టుకునే రేటు, రక్తపోటు విపరీతంగా పెరిగిపోతాయి. కొన్నిసార్లు మెదడుకు సంబంధించిన తీవ్రరుగ్మతలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రులు తమ వారి వ్యవహారశైలిపై కన్నేసి ఉంచాలని, అవసరం లేకుండా దగ్గు మందుల వాడకాన్ని నిరోధించాలని పోలీసులు కోరుతున్నారు. ఎలాంటి చీటీ లేకుండా వీటిని విక్రయిస్తున్న ఔషధ దుకాణాలపై నిఘా ముమ్మరం చేశామని, వాటి యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు