Drug Case: షారూక్‌ కొడుక్కు క్లీన్‌చిట్‌

28 May, 2022 05:19 IST|Sakshi

ఆర్యన్‌పై డ్రగ్స్‌ కేసు వెనక్కు తీసుకున్న ఎన్‌సీబీ

సాక్ష్యాల్లేక అభియోగాలు నమోదు చేయలేదని వెల్లడి

మాజీ అధికారిపై వాంఖెడేపై చర్యలకు కేంద్రం ఆదేశం

ముంబై/న్యూఢిల్లీ: మాదకద్రవ్యాల కేసులో బాలీవుడ్‌ నటుడు షారూక్‌ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌కు క్లీన్‌చిట్‌ లభించింది. ఆర్యన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలూ లభించలేదని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) పేర్కొంది. దాంతో అతనిపై అభియోగాలు నమోదు చేయలేదని కోర్టుకు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి ఎన్‌సీబీ శుక్రవారం ముంబై కోర్టుకు 6 వేల పేజీల చార్జిషీటు సమర్పించింది.

ఆర్యన్, మరో ఐదుగురి పేర్లను అందులో ప్రస్తావించలేదు. సంజయ్‌కుమార్‌ సింగ్‌ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణ జరిపి 14 మందిపై ఎన్‌డీపీఎస్‌ చట్టంలోని పలు సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసి కోర్టుకు సమర్పించింది. ‘‘ఆర్యన్‌కు వ్యతిరేకంగా పక్కా సాక్ష్యాలేవీ దొరకలేదు. దాంతో అతన్ని, మరో ఐదుగురిని చార్జిషీటు నుంచి మినహాయించాం’’ అని ఎన్‌సీబీ చీఫ్‌ ఎస్‌.ఎన్‌.ప్రధాన్‌ చెప్పారు. ఆర్యన్, మొహక్‌ల దగ్గర డ్రగ్స్‌ లభించలేదన్నారు.

సత్యమే గెలిచిందని ఆర్యన్‌ తరఫున వాదించిన లాయర్‌ ముకుల్‌ రోహత్గీ అన్నారు. ఎన్‌సీబీ తన తప్పిదాన్ని అంగీకరించిందని చెప్పారు. ఆర్యన్‌కు క్లీన్‌చిట్‌పై నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) హర్షం వ్యక్తం చేసింది. ఆర్యన్‌ అనుభవించిన     మనస్తాపానికి ఎన్‌సీబీ ముంబై జోనల్‌ డైరెక్టర్‌గా కేసులో ప్రాథమిక విచారణ చేసిన సమీర్‌ వాంఖెడే బాధ్యత వహించాలంది. తప్పుల తడకగా        విచారణ జరిపినందుకు వాంఖెడేపై చర్యలు      తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది.

ఏం జరిగింది..?  
ముంబై నుంచి గోవా వెళ్తున్న ఓడలో రేవ్‌ పార్టీ   జరుగుతోందన్న సమాచారంతో 2021 అక్టోబర్‌ 2న ఎన్‌సీబీ అధికారులు చేసిన దాడుల్లో ఆర్యన్‌ఖాన్‌ దొరికిపోయాడు. ఆర్యన్‌తో పాటు మొత్తం 8 మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠాలతో లింకులున్నాయని ఎన్‌సీబీ వాదించడంతో ఆర్యన్, అర్బాజ్, దమేచాలను కోర్టు రిమాండ్‌కు అప్పగించింది. ఆర్యన్‌ను జైల్లో పెట్టారు. 22 రోజుల తర్వాత వారికి బెయిల్‌ దొరికింది.

కేసు వీగింది ఇందుకే...
► ముంబై క్రూయిజ్‌లో ఆర్యన్‌ను అరెస్ట్‌ చేసినప్పుడు అతని దగ్గర ఎలాంటి మాదకద్రవ్యాలూ దొరకలేదు. పడవలో అరెస్టు చేసిన ఇతర నిందితుల వద్ద లభించిన డ్రగ్స్‌నే అరెస్టు చేసిన వారందరి దగ్గర నుంచి గంపగుత్తగా లభించినట్టు చూపారు. ఇది ఎన్‌డీపీఎస్‌ నిబంధనలకు విరుద్ధం.
► ఆర్యన్‌ డ్రగ్స్‌ తీసుకున్నట్టు నిర్ధారించడానికి వైద్య పరీక్షలేవీ చేయలేదు.
► పడవలో రేవ్‌ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో దాడి చేశామంటున్న ఎన్‌సీబీ వీడియో ఫుటేజ్‌ సమర్పించలేదు.
► ఆర్యన్‌ ఫోన్‌ చాటింగ్స్‌ ఈ కేసుకు సంబంధించినవి కావు. అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠాలతో అతనికి లింకులున్నట్టు వాటిలో ఆధారాలేవీ లేవు.
► ఎన్‌సీబీ సాక్షులు విచారణలో ఎదురు తిరిగారు. అధికారులు తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్నారని ఒకరు, ఆ సమయంలో తాము ఆ పరిసరాల్లోనే లేమని మరో ఇద్దరు చెప్పారు.

మరిన్ని వార్తలు