ఆన్‌లైన్‌లో డ్రగ్స్‌ వ్యాపారం

23 Nov, 2020 04:17 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా

కళాశాలలకు ఎల్‌ఏడీ సరఫరా

విశాఖలో ఐదుగురు విద్యార్థుల అరెస్టు

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో విద్యార్థి

నగరంలో స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసుల ఆపరేషన్‌ 

సాక్షి, విశాఖపట్నం:  యువతను మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుస్తూ ఆన్‌లైన్‌లో డ్రగ్స్‌ విక్రయిస్తున్న ఐదుగురు విద్యార్థుల ముఠాను విశాఖలో నగర పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేరంలో పాలుపంచుకున్న మరో విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. నిందితుల నుంచి 27 బ్లాట్ల ఎల్‌ఏడీ (లిసర్జిక్‌ యాసిడ్‌ డై ఇథైల్‌మైడ్‌) డ్రగ్స్‌ను స్వాదీనం చేసుకున్నారు. కళాశాల విద్యార్థులే లక్ష్యంగా నగరంలో డ్రగ్స్‌ విక్రయాలు జరుగుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు విశాఖ స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు శనివారం అర్ధరాత్రి ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టారు. ఐదుగురు విద్యార్థులను అరెస్టు చేసి డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నగర పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా ఆదివారం మీడియాకు వివరాలు వెల్లడించారు.  

చైన్‌లింక్‌ విక్రయాలు.. 
నిందితులు చిన్ననాటి స్నేహితులు. ఏ1– అరవింద్‌ అగర్వాల్‌ (21) ఇటీవల బెంగళూర్‌లో డిగ్రీ (బీబీఏ) పూర్తి చేశాడు. తన స్నేహితుడి ద్వారా ఒక్కో ఎల్‌ఏడీ బ్లాట్‌ని రూ.400కి కొనుగోలు చేసి ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించి మరో నలుగురు స్నేహితులకు రూ.వెయ్యికి విక్రయిస్తున్నాడు. ఇలా కొనుగోలు చేసిన ఒక్కో ఎల్‌ఏడీ–బ్లాట్‌ని వీరు తిరిగి రూ.2 వేల చొప్పున కళాశాల విద్యార్థులకు అమ్ముతున్నారు. ఆదివారం మధ్యాహ్నం సాంకేతిక ఇంజినీరింగ్‌ కళాశాల, గాయత్రి కళాశాల వద్ద ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. నలుగురు నిందితులను ఏ–2 కనపర్తి సాహిల్‌ (20), ఏ–3 పిల్లా చంద్రశేఖర్‌(28), ఏ–4 మైఖేల్‌ వెల్కమ్‌(22), ఏ–5 మసబత్తుల మురళీధర్‌(20)గా గుర్తించారు. మరో నిందితుడు అశోక్‌ యతిరాజ్యం (22) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.  

యువతపై దుష్ప్రభావం.. 
నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఎల్‌ఏడీ బ్లాట్స్‌ విలువ సుమారు రూ.లక్ష లోపే ఉన్నప్పటికీ యువతపై చాలా దుష్ప్రభావం చూపుతుందని సీపీ మనీ‹Ùకుమార్‌ సిన్హా పేర్కొన్నారు. నగరంలోకి డ్రగ్స్‌ ఎలా వస్తున్నాయి? ప్రధాన సూత్రధారులపై విచారణ చేపట్టామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అశోక్‌ యతిరాజ్యంపై 2019లోనూ డ్రగ్స్‌ విక్రయిస్తున్నట్లు కేసులు నమోదయ్యాయని తెలిపారు. డ్రగ్స్‌ మాఫియాను కూకటివేళ్లతో నిర్మూలించాలని సిబ్బందిని ఆదేశించినట్లు చెప్పారు.  

రకరకాల పేర్లతో విక్రయాలు... 
ఎల్‌ఏడీని వివిధ దేశాల్లో 80 రకాల పేర్లతో డ్రగ్స్‌ వ్యాపారులు విక్రయిస్తున్నారు. యాసిడ్, బ్లాటర్, డోసెస్, డాట్స్, ట్రిప్స్, మెల్లో ఎల్లో, విండో పనె, పర్పుల్‌ డ్రాగన్‌ తదితర పేర్లతో వీటి విక్రయాలు సాగుతున్నాయి. 1938లో ఇది తొలిసారిగా ఉనికిలోకి వచి్చంది. ‘రై’ అనే గింజలపై పెరిగే ఎర్గాట్‌ అనే ఒక రకమైన ఫంగస్‌ నుంచి దీన్ని తయారు చేస్తారు. చాలా స్వల్ప మోతాదుల్లో మైక్రోగ్రామ్‌(ఎంసీజీ)లో విక్రయాలు జరుగుతాయి. ఇది కలిగించే అనుభవాన్ని ‘ట్రిప్‌’ అని వ్యవహరిస్తుంటారు. ఉత్తేజం కోసం ముక్కు ద్వారా పీల్చుకోవడం, ఇంజెక్షన్‌ రూపంలో తీసుకునే ఈ డ్రగ్‌ ఒక్కోసారి ప్రమాదకరమైన అనుభవాన్ని మిగుల్చుతుంది. అమెరికాలో వీటి విక్రయాలను నిషేధించిన డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజన్సీ షెడ్యూల్‌ – 1 డ్రగ్స్‌లో చేర్చింది. వైద్య చికిత్సలోనూ దీన్ని వినియోగించడం లేదు. ఎల్‌ఏడీని స్పటికాకృతిలో తయారు చేసి ఇతర పదార్థాలతో మేళవిస్తారు. దీని రుచి కొద్దిగా చేదుగా ఉంటుంది.  

మరిన్ని వార్తలు