డ్రగ్స్‌ రాకెట్‌లో చిరువ్యాపారులు!

12 Aug, 2020 07:56 IST|Sakshi

బోయిన్‌పల్లి ఉదంతంతో బట్టబయలు 

డ్రగ్స్‌ సరఫరాలో ఇటీవల ఓ టైల్స్‌ వ్యాపారి అరెస్ట్‌ 

లాక్‌డౌన్‌ నష్టాల నేపథ్యంలో అడ్డదారులు  

గ్రేటర్‌లో మళ్లీ డ్రగ్స్‌ రాకెట్‌ కలకలం 

ముంబై కేంద్రంగా నగరంలో కార్యకలాపాలు 

సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్‌లో మళ్లీ డ్రగ్స్‌ రాకెట్‌ కలకలం రేపుతోంది. తాజాగా ఈ రాకెట్‌లో చిరువ్యాపారులు భాగస్వాములు కావడం సంచలనం సృష్టిస్తోంది. నగరంలో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం ఇటీవల నిర్వహిస్తున్న వరుస దాడుల్లో ముంబై కేంద్రంగా పని చేస్తున్న బడా డ్రగ్స్‌ మాఫియా గుట్టు రట్టయింది. అక్రమార్కులు నగరంలోని కొందరు చిరు వ్యాపారులు, కొందరు నైజీరియన్లు, నిరుద్యోగులకు డబ్బు ఎరవేసి డ్రగ్స్‌ సరఫరాలో వారి సేవలను వినియోగిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల బోయిన్‌పల్లి చెక్‌పోస్ట్‌ వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో టైల్స్‌ వ్యాపారి హనుమాన్‌ రామ్‌ కారును తనిఖీ చేయగా.. రూ.1.20 లక్షల విలువైన ఓపియం డ్రగ్‌ను తరలిస్తున్న వైనం వెలుగుచూసింది. రాజస్థాన్‌కు చెందిన ఇతను పదేళ్ల క్రితం నగరానికి వలస వచ్చి జీడిమెట్లలో టైల్స్‌ దుకాణం నిర్వహిస్తున్నాడు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వ్యాపారంలో నష్టాలు రావడంతో అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలని ఇలా డ్రగ్స్‌ వ్యాపారంలోకి దిగినట్టు పోలీసుల విచారణలో ఇతను వెల్లడించడం గమనార్హం. కాగా ఇటీవల కాలంలో నగరంలో తరచు నమోదవుతున్న  డ్రగ్స్‌ కేసులు సంచలనం సృష్టిస్తున్నాయి. 

సిటీలోతరచు డ్రగ్స్‌ కలకలం..  
ఇటీవల నగరంలోని  తార్నాక చౌరస్తాలో భారీ డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టును ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసులు రట్టుచేశారు. నిందితుల వద్ద  నుంచి రూ.1.64 లక్షల విలువ చేసే 104 గ్రాముల కొకైన్‌తోపాటు ఒక యమహా ఎఫ్‌జడ్‌ బైక్, నాలుగు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నైజీరియాకు చెందిన జడీ పాస్కల్‌(35),అతని గర్ల్‌ఫ్రెండ్‌ ఎబిరె మోనికా(30) తార్నాక నాగార్జుననగర్‌లో ఇటీవల ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. వీరికి ముంబై కేంద్రంగా డ్రగ్స్‌రాకెట్‌ నడుపుతున్న ఎరిక్,బెన్,» బెంగళూరుకు చెందిన బనార్డ్‌లు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నారు. ఈ జంట వారు సరఫరా చేసిన కొకైన్‌ ను గ్రాము రూ.8 వేలు చొప్పున నగరంలో పలువురికి విక్రయిస్తోంది.   గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌ ప్రాంతాలకు సైతం ఈ జంట మాదకద్రవ్యాలను సరఫరా చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. 

సెలబ్రిటీలకు సరఫరాపై అనుమానాలు.. 
నగరంలో సంపన్నులు నివసించే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో వీఐపీలు, సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకొని నగరంలో విచ్చలవిడిగా డ్రగ్స్‌ సరఫరా అవుతున్నట్లు ఇటీవల వరుసగా పట్టుబడుతున్న డ్రగ్స్‌ రాకెట్‌ ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి. ముంబై, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న బడా డ్రగ్స్‌ మాఫియా పలువురు నైజీరియన్లకు, చిరువ్యాపారులు, నిరుద్యోగులకు డబ్బును ఎరగా చూపి ఈ వ్యాపారంలోకి దించుతూ..నగరంలో వినియోగదారులకు డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్టు  స్పష్టమౌతోంది. తాజా కేసు ఇలాంటి కోవకే చెందినది కావడం గమనార్హం. ఎక్సైజ్‌ పోలీసులు నగరంలో ప్రత్యేకంగా కాల్‌సెంటర్‌ ఏర్పాటుచేసి సమాచారం అందిన వెంటనే డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టును రట్టు చేయాలని సిటీజన్లు కోరుతున్నారు.  

మరిన్ని వార్తలు