మందుబాబు దూకుడు.. పోలీసుల్నే 'ఢీ' కొట్టాడు

29 Mar, 2021 04:54 IST|Sakshi
చికిత్స పొందుతున్న ఏఎస్‌ఐ మహిపాల్‌రెడ్డి

హోంగార్డు సహా మహిళకు గాయాలు 

ఈ ఘటన వివరాలు తెలుసుకుంటున్న 

ఏఎస్‌ఐని ఢీకొట్టిన మరో వాహనం 

ఏఎస్‌ఐ మహిపాల్‌రెడ్డికి తీవ్రగాయాలు.. ఆస్పత్రిలో చికిత్స 

ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న సీపీ సజ్జనార్

సాక్షి, కేపీహెచ్‌బీ కాలనీ: మద్యం సేవించి వాహనం నడుపుతూ వచ్చిన వ్యక్తి డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీ విధుల్లో ఉన్న హోంగార్డుతో పాటు ఓ మహిళను ఢీకొట్టాడు. దీంతో వారికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటన గురించి తెలుసుకొని వివరాలు సేకరిస్తున్న ఏఎస్‌ఐని అతివేగంతో వచ్చిన మరో ట్యాక్సీ డ్రైవర్‌ ఢీకొట్టాడు. దీంతో ఆయన రోడ్డు పక్కనే ఉన్న రాయిపై ఎగిరిపడ్డారు. తల, కాలుకు తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఉదంతమంతా కేపీహెచ్‌బీ ఠాణా పరిధిలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. రాత్రి 10 గంటల సమయంలో నిజాంపేట రోడ్డులోని కొలన్‌ రాఘవరెడ్డి గార్డెన్స్‌ సమీపంలో కేపీహెచ్‌బీ లా అండ్‌ ఆర్డర్, కూకట్‌పల్లి ట్రాఫిక్‌ పోలీసులు సంయుక్తంగా డ్రంక్‌ డ్రైవ్‌ చేపట్టారు. సుమారు 11.40 గంటల సమయంలో బాచుపల్లికి చెందిన సృజన్‌.. పవన్‌తో కలసి మద్యం సేవించి తన స్నేహితుడైన శ్రీధర్‌ను పికప్‌ చేసుకునేందుకు నిజాంపేట వైపు టీఎస్‌03 ఈజెడ్‌ 9119 నంబర్‌ గల క్రెటా వాహనంలో బయలుదేరారు.

పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చేస్తున్న విషయాన్ని గుర్తించి వారి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తుండగా కానిస్టేబుల్‌ రాజ్‌కుమార్‌ వారి కారు వద్దకు వచ్చి ఆపాలని సూచించాడు. దీంతో సృజన్‌ కారును వేగంగా రివర్స్‌ తీసుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో హోంగార్డు ప్రహ్లాద్‌తో పాటు తనూజ అనే మహిళను ఢీకొట్టాడు. ఎస్‌ఐ సక్రమ్‌ అప్రమత్తమై గాయాలైన ప్రహ్లాద్, తనూజను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన సృజన్‌ను అదుపులోకి తీసుకుని బ్రీత్‌ ఎనలైజర్‌తో పరీక్షించగా 174గా నమోదు కావడం విశేషం. కారులో ఉన్న సృజన్‌ స్నేహితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.  

దూసుకొచ్చిన క్యాబ్‌... 
ఈ ఘటన గురించి తెలుసుకున్న నైట్‌ రౌండింగ్‌ ఏఎస్‌ఐ మహిపాల్‌రెడ్డి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ జరుగుతున్న చోటుకు చేరుకున్నాడు. మహిపాల్‌రెడ్డి ప్రమాద వివరాలను నోట్‌ చేసుకుంటుండగానే అర్ధరాత్రి 12.10 గం. సమయంలో టీఎస్‌08 యూడీ 2984 నంబర్‌ గల క్యాబ్‌ను అతి వేగంగా నడుపుతూ అటుగా వచ్చిన అస్లాం అలీ.. మహిపాల్‌రెడ్డిని ఢీకొట్టాడు. ఆయన ఎగిరి రోడ్డు పక్కనే ఉన్న రాయిపై పడటంతో కాలు, తలకు తీవ్రగాయాలయ్యాయి. మహిపాల్‌రెడ్డిని కొండాపూర్‌లోని కిమ్స్‌కు తరలించారు. సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ఆస్పత్రికి వెళ్లి మహిపాల్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణమైన సృజన్, అస్లాం అలీలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు