దాడి చేసింది మేనత్త కొడుకే 

7 Sep, 2022 05:35 IST|Sakshi

బాలికపై యాసిడ్‌ దాడి కేసులో నెల్లూరు రూరల్‌ డీఎస్పీ హరినాథరెడ్డి వెల్లడి 

బాలికపై నిందితుడు ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడలేదు 

వైద్యం ఖర్చు ప్రభుత్వానిదే: పద్మ

నెల్లూరు (క్రైమ్‌)/సాక్షి, అమరావతి: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో సోమవారం సాయంత్రం బాలికపై యాసిడ్‌ పోసి గొంతు కోసిన వ్యక్తి బాధితురాలి స్వయాన మేనత్త కొడుకేనని నెల్లూరు రూరల్‌ డీఎస్పీ వై.హరినాథరెడ్డి వెల్లడించారు. దాడి అనంతరం ఇంట్లోని నగదును అపహరించుకుని వెళ్లాడన్నారు. వివరాలను మంగళవారం మీడియాకు వివరించారు. చెముడుగుంట నక్కలకాలనీలో నివాసముంటున్న దంపతుల కుమార్తె(14) తొమ్మిదో తరగతి చదువుతోంది.  

బాలిక మేనత్త కొడుకు నాగరాజు భార్య వినాయక చవితి వేడుకల కోసం కసుమూరులోని పుట్టింటికి  వెళ్లింది. మరోవైపు.. ఈనెల 5న బాలిక తల్లిదండ్రులు పనికి వెళ్లారు. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది.  నాగరాజు  మద్యం తాగొచ్చి ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు. భోజనం చేసేందుకు కూర కావాలని   కోరాడు. బాలిక కూర ఇవ్వగా నిందితుడు దానిని తీసుకువెళ్లి భోజనం చేశాడు. అనంతరం కూర గిన్నెలో యాసిడ్‌ పోసుకుని మళ్లీ బాలిక దగ్గరకు వచ్చాడు.

బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తుండగా ఆమె వెంటనే పారిపోయేందుకు యత్నించింది. ఇంతలో నిందితుడు యాసిడ్‌లో ఓ వస్త్రాన్ని ముంచి దానిని ఆమె ముఖంపై గట్టిగా అద్ది కత్తితో ఆమె గొంతుకోశాడు. దీంతో బాలిక స్పృహ కోల్పోవడంతో మృతిచెందిందని భావించి  బీరువా నుంచి రూ.4 వేలు, ఆమె చెవికున్న కమ్మలను తీసుకుని పరారయ్యాడు.  

స్పృహ నుంచి కోలుకున్న బాధితురాలు చుట్టుపక్కల వారికి విషయాన్ని తెలియజేసింది. వారు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి, కలెక్టర్‌ కె.చక్రధర్‌బాబు, ఎస్పీ సీహెచ్‌ విజయారావు తదితరులు మెరుగైన వైద్యం కోసం బాలికను అపోలో ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో చెన్నై అపోలోకు తరలించారు. బాలికపై ఎలాంటి అఘాయిత్యం జరగలేదని.. పూర్తిగా దర్యాప్తుచేసి నిందితునిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వెల్లడించారు.

బాలిక త్వరగా కోలుకోవాలి : వాసిరెడ్డి పద్మ 
దాడి ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌  వాసిరెడ్డి పద్మ స్పందించారు.  బాధితురాలు త్వరగా కోలుకోవాలని, వైద్యానికి అయ్యే ఖర్చంతా ప్రభుత్వం భరిస్తుందన్నారు. 

మరిన్ని వార్తలు