ప్రాణం తీసిన పాత కక్షలు 

29 Jan, 2021 10:26 IST|Sakshi

ఇరు కుటుంబాల ఘర్షణలో..

కొండపై నుంచి కింద పడి మహిళ మృతి 

మృతురాలి కొడుకు ఫిర్యాదుతో హత్య కేసుగా నమోదు  

భవానీపురం(విజయవాడ పశి్చమ): బంధువుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక మహిళ మృతి చెందిన ఘటన విద్యాధరపురం చెరువు సెంటర్‌లోని రాములవారి గుడిపైగల కొండ ప్రాంతంలో చోటు చేసుకుంది. అయితే మృతురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు హత్య కేసు కింద నమోదు చేసి విచారిస్తున్నారు. పోలీసులు, ఫిర్యాదుదారు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి... ఊరి్మళానగర్‌ పోలేరమ్మ గుడి వద్దగల న్యూ ఫ్లేమ్‌ ఏజెన్సీలో గ్యాస్‌ వెల్డర్‌గా పని చేస్తున్న సగల శ్రీను తల్లిదండ్రులు, వడ్రంగం పని చేస్తున్న సోదరుడితో కలిసి స్థానిక చెరువు సెంటర్‌లోని రామాలయం కొండపైన నివసిస్తున్నారు. అతని తల్లి కనకరత్నం సమీప బంధువులైన రామిశెట్టి సతీష్‌, సగల యేసు తరచూ శ్రీను కుటుంబంతో గొడవ పడుతుంటారు.

ఈ క్రమంలో ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5.30 గంటల సమయంలో శ్రీను తమ్ముడు భాస్కర్‌ పని ముగించుకుని ఇంటికి వస్తుండగా చెరువు సెంటర్‌ దగ్గరకు వచ్చే సరికి సతీష్‌ అతనిని దుర్భాషలాడుతూ కొట్టాడు. భాస్కర్‌ ఇంటికి వెళ్లి తల్లి కనకరత్నంతో జరిగిన విషయాన్ని చెప్పాడు. దీంతో ఆమె భాస్కర్‌ను తీసుకుని కిందకు వెళ్లి భాస్కర్‌ను ఎందుకు కొట్టావని నిలదీసింది. సతీష్‌ ఆమెను కూడా దుర్భాషలాడుతూ నిన్ను, నీ కొడుకును ఎప్పటికైనా చంపేస్తానని బెదిరించాడు. 

కొండపై నుంచి తోసేశారు 
అదే రోజు రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో సతీష్, యేసు.. శ్రీను ఇంటి దగ్గరకు వచ్చి అసభ్యంగా తిట్టటం మొదలు పెట్టారు. శ్రీను, తల్లి కనకరత్నం బయటకు వచ్చి వారిని వెళ్లిపొమ్మని చెప్పినా వినకుండా గొడవకు దిగారు. ఈ క్రమంలో వారిద్దరూ తల్లీ, కొడుకులపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో కనకరత్నంను కొండపై నుంచి తోసేయడంతో ఆమె దాదాపు 30 అడుగుల కింద ఉన్న డ్రెయినేజి గట్టుపై పడిపోయింది. దీంతో ఆమె తలపగిలి అక్కడిక్కడే మృతి చెందింది.

సమాచారం అందుకున్న సీఐ జె. మురళీకృష్ణ, ఎస్‌ఐలు ఎంవీవీ రవీంద్రబాబు, జె. కవితశ్రీ సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాత గొడవలను దృష్టిలో పెట్టుకుని తన తల్లిని చంపాలనే ఉద్దేశ్యంతోనే పైనుంచి తోసేశారని, ఆమె చావుకు కారణమైన సతీష్, యేసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతురాలి కుమారుడు శ్రీను ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు సతీష్, యేసులను అదుపులోకి తీసుకుని వారిపై హత్య కేసును నమోదు చేశారు.  

      


     

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు