అంకిత సజీవ దహన ఉదంతంలో ట్విస్ట్‌.. ఆమె మైనర్‌, ఆ ఫొటోలు మార్ఫింగ్‌ చేసినవే!

31 Aug, 2022 16:13 IST|Sakshi

జార్ఖండ్‌ డుమ్కాలో ఓ ప్రేమోన్మాది  ఒక స్టూడెంట్‌ను సజీవ దహనం చేసిన ఉదంతం మరో మలుపు తిరిగింది. బాధితురాలు మేజర్‌ కాదని.. మైనర్‌ అని చైల్డ్‌ వెల్ఫ్‌ఫేర్‌ కమిటీ నిర్ధారించింది. దీంతో పోక్సో చట్టం ప్రకారం కేసు, నిందితుడిపై అభియోగాలను నమోదు చేయాలని ఈ ప్యానెల్‌.. పోలీసులను ఆదేశించింది. 

రాంచీ: అకింతా సింగ్‌ హత్యోదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 12వ తరగతి చదువుతున్న బాధితురాలి వయసును తొలుత.. 19 ఏళ్లుగా రిపోర్ట్‌లో పొందుపర్చారు పోలీసులు. అయితే మీడియాకు మాత్రం వయసును 17ఏళ్లుగా చెప్పారు. అంకిత వయసుపై పోలీసులు చేస్తున్న వేర్వేరు ప్రకటనలపై ఆమె కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో రంగంలోకి దిగిన చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ ఆమె వయసును 15ఏళ్లుగా నిర్ధారిస్తూ ప్రకటన చేసింది. అంతేకాదు.. రికార్డెడ్‌ స్టేట్‌మెంట్‌లోనూ ఆమె వయసును సవరించాలంటూ స్థానిక ఎస్పీకి సూచించింది. 

మతోన్మాది ఘాతుకం!
డుమ్కా ప్రాంతానికి చెందిన అంకితా కుమారి సింగ్‌ను.. పొరుగింట్లో ఉండే షారూఖ్‌ హుస్సేన్‌(19) ప్రేమ, పెళ్లి పేరుతో వేధించసాగాడు. పెద్దలు మందలించినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ క్రమంలో ఆగష్టు 23వ తేదీన ఇంట్లో నిద్రిస్తున్న ఆమెపై పెట్రోల్‌ పోసి.. నిప్పటించి పారిపోయాడు. 

90 శాతం తీవ్ర గాయాలతో ఫులో జానో మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఆగస్టు 28వ తేదీన అంకిత కన్నుమూసింది. ఈ ఘటనలో బాధితురాలిని వేధింపులు.. మతం మారాలనే ఒత్తిడి చేసినట్లు తేలడంతో ఈ హత్యోదంతం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలను దారి తీసింది. బీజేపీతో పాటు భజరంగ్‌ దల్‌ కార్యకర్తలు బాధితురాలి న్యాయం కోసం పోరాటానికి దిగారు. నిందితుడిని ఎన్‌కౌంటర్‌ చేయాలంటూ డిమాండ్‌ చేస్తూ.. ఆందోళనలు చేపట్టారు. మరోవైపు బీజేపీ ఒత్తిడితో బాధిత కుటుంబానికి పది లక్షల రూపాయల పరిహారం ప్రకటించగా.. ఆమె తండ్రి సంజీవ్‌ సింగ్‌ ఆ పరిహారాన్ని తిరస్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఇక కేసులో సత్వర న్యాయం కోసం ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేసినట్లు సీఎం హేమంత్‌ సోరెన్‌ ప్రకటించారు.

ఆ ఫొటోలు మార్ఫింగ్‌వి!
ఇదిలా ఉంటే.. నిందితుడు షారూఖ్‌ హుస్సేన్‌తో సన్నిహితంగా ఉన్న బాధితురాలి ఫొటోలు కొన్ని నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. దీనిపై అంకిత కుటుంబం స్పందించింది. ఈ కేసును పక్కదారి పట్టించేందుకు, నిందితుడిని బయటపడేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయంటూ మండిపడింది. తమ కూతురికి సత్వర న్యాయం జరగకపోతే ఆమరణ దీక్షకు దిగుతామని హెచ్చరించింది అంకిత కుటుంబం.   

ఫొటోలు, వీడియోలు వైరల్‌ చేయకండి

ఇదిలా ఉంటే.. డుమ్కా మైనర్‌ హత్యోదంతంపై జాతీయ మహిళా కమిషన్‌ నుంచి ఇద్దరు సభ్యుల నిజనిర్ధారణ కమిటీ ఇవాళ(బుధవారం) డుమ్కాలో పర్యటించి.. వివరాలను సేకరించింది. అయితే.. బాధితురాలి ఫొటోలను, వీడియోలను సోషల్‌ మీడియాలో విడుదల చేయడంపై ఎన్‌సీడబ్ల్యూ లీగల్‌ కౌన్సెలర్‌ షాలిని సింగ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది బాధితురాలి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని, దానిని పరిరక్షించాల్సిన అవసరం ఉందని ఆమె వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: పెళ్లికి నిరాకరిస్తోందని యువతిపై దాడి...ఆ తర్వాత అతను

మరిన్ని వార్తలు