బాధితుల గొంతుక.. ప్రాణాలతో పోరాడుతున్న డచ్‌ క్రైమ్‌ రిపోర్టర్‌

7 Jul, 2021 18:25 IST|Sakshi

హేగ్ (నెదర్లాండ్స్): ప్రముఖ డచ్‌ క్రైమ్‌ రిపోర్టర్‌ పీటర్‌ ఆర్‌. డి వ్రీస్‌పై దుండుగులు కాల్పులకు తెగపడ్డారు. తీవ్రగాయాపాలైన ఆయనను ఆమ్స్టర్డామ్‌లోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. ప్రస్తుతం ఆయన ప్రాణాలతో పోరాడుతున్నారు. ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం.. డి వ్రీస్ తలపై దుండగులు అయిదు సార్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. పీటర్ ఆర్. డి వ్రీస్ జర్నలిస్ట్, టీవీ ప్రెజెంటర్. క్రిమినల్ కేసులపై పరిశోధన చేయడంలో ఆయనకు మంచి పేరు ఉంది. పీటర్ ఆర్. డి వ్రీస్ బాధితుల తరపున నిత్యం తన గొంతుకను వినిపిస్తుంటారు. గతంలో డి వ్రీస్‌కు అనేక కేసులకు సంబంధించి క్రిమినల్ అండర్ వరల్డ్ నుంచి బెదిరింపులు కూడా వచ్చాయి.

ఈ ఘటనపై డచ్ ప్రధాన మంత్రి మార్క్ రుట్టే హేగ్‌లోని విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ఈ దాడి దిగ్భ్రాంతికరమైనది. ఓ సాహసోపేతమైన జర్నలిస్టుపై దాడి చేయడం.. మన ప్రజాస్వామ్యం, స్వేచ్ఛాయుత పత్రికల పై దాడి చేయడం వంటిది." అని అన్నారు. కాగా, ఈ ఘటనలో షూటర్‌తో.. సహా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. డౌన్ టౌన్ లీడ్సెప్లిన్ స్క్వేర్ సమీపంలో కాల్పులు జరిపిన ప్రాంతంలో వీడియో ఫుటేజ్, సాక్షి స్టేట్మెంట్స్, ఫోరెన్సిక్ సాక్ష్యాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఇక 2005లో అరుబాలో టీనేజర్ నటాలీ హోల్లోవే అదృశ్యంపై దర్యాప్తు చేసినందుకు 2008లో కరెంట్ ఎఫైర్స్ విభాగంలో డి వ్రీస్ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డును గెలుచుకున్నారు.

మరిన్ని వార్తలు