శివమొగ్గ జిల్లాలో పేలుడు

22 Jan, 2021 06:40 IST|Sakshi
సంఘటనా స్థలంలో ఎగసి పడుతున్న మంటలు

సాక్షి బెంగళూరు/శివమొగ్గ: కర్ణాటకలోని శివమొగ్గ సమీపంలో ఉన్న అబ్బలగెరి తాలూకా హుణసోడు గ్రామంలో గురువారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో తాజా సమాచారం అందే సమయానికి ఎనిమిది మృతదేహాలు వెలుగుచూశాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి భూమి తీవ్రంగా కంపించింది. భయభ్రాంతులకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. శివమొగ్గ నగరానికి చెందిన ఒక ప్రైవేటు రైల్వే క్రషర్‌ (రాళ్ల గని)లో ఈ పేలుడు జరిగింది. ఈ క్రషర్‌కు లారీలో పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు తీసుకొస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. సుమారు 50 వరకు డైనమేట్లను రవాణా చేస్తున్నట్లు సమాచారం.

ఈ పేలుడు ధాటికి లారీ, దాని పక్కనే ఉన్న బొలేరే వాహనం ముక్కలుముక్కలయ్యాయి. ఎనిమిది మంది శరీరాలు ఛిద్రమై ఎగిరిపడ్డాయి. పేలుడు శబ్దం సుమారు 20–30 కిలోమీటర్ల వరకు వినిపించిందని సమాచారం. అంతేకాక తీర్థహళ్లి, హోసనగర, సాగర, భద్రావతి వంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఐదారు సెకన్లపాటు భూమి కంపించింది. చిక్కమగళూరు, ఉత్తర కన్నడ జిల్లాల్లో కూడా భూమి స్వల్పంగా కంపించినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో బిహార్‌కు చెందిన మరికొంతమంది కార్మికులు మృతిచెంది ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితులను పరిశీలించి సహాయక చర్యలను చేపట్టారు.

మరిన్ని వార్తలు