రూ. 22 వేల కోట్ల స్కాం : ఓంకార్ గ్రూప్ చైర్మన్ అరెస్ట్‌

27 Jan, 2021 18:37 IST|Sakshi

సాక్షి,ముంబై:  వేల కోట్ల రూపాయల కుంభకోణం కేసులో అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ ఓంకార్ గ్రూప్ చైర్మన్ కమల్ గుప్తా, మేనేజింగ్ డైరెక్టర్ బాబూలాల్ వర్మలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) షాకిచ్చింది. రూ .22 వేల కోట్ల మేర పలు బ్యాంకులను ముంచేసిన స్కాంలో మనీలాండరింగ్‌ ఆరోపణలపై బుధవారం వీరిని అరెస్టు చేసింది. విచారణ అనంతరం గురువారం ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టులో హాజరుపరచనున్నారు.

మురికివాడల పునరావాసం పేరుతో కమల్ గుప్తా, బాబు లాల్ వర్మ 22 వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు.  ప్రధానంగా యస్‌ బ్యాంక్ నుంచి రూ .450 కోట్లతో సహా పలు బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో  ఓంకర్ గ్రూప్‌నకు చెందిన  పలు ఆఫీసులు, నివాసాలపై ఈడీ వరుస దాడులు చేపట్టింది. 10 చోట్ల నిర్వహించిన ఈ దాడుల్లో అనేక కీలక పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ నేపథ్యంలో తాజా అరెస్టులు చోటు చేసుకున్నాయి. ఈడీ కార్యాలయంలోబాబులాల్ వర్మ, కమల్ గుప్తాను ప్రశ్నించిన ఈడీ దర్యాప్తునకు నిందితులిద్దరూ సహకరించలేదని ఆరోపించింది. ఈ నేపథ్యంలో కస్టోడియల్ విచారణను కోరినట్టు తెలిపింది.  

మురికివాడల  పునరావాసం పేరిట ఓంకార్ గ్రూప్, గోల్డెన్ ఏజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ  సంస్థలు  ఫోర్జరీ చేశాయని, తప్పుడు పత్రాలను సృష్టించి వేలకోట్ల అక్రమాలకు పాల్పడ్డాయంటూ 2019లో బాంబే హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. మురికివాడల పునరావాస అథారిటీ (ఎస్‌ఆర్‌ఏ) అధికారులతో  ఓమ్కర్ గ్రూప్ సిబ్బంది కుమ్మక్కై తప్పుడు వివిధ బ్యాంకుల నుండి సుమారు 22,000 కోట్ల రూపాయల రుణాలు పొందారని ఆరోపణలు నమోదయ్యాయి. దీనిపై ముంబై పోలీసుల ఎకనామిక్ నేరాల విభాగం దర్యాప్తు చేస్తోంది. కాగా ముంబైలోని అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలలో ఓంకర్ గ్రూప్ ఒకటి, ఇది ప్రధానంగా నగర శివారులోని విలాసవంతమైన ప్రీమియం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను నిర్వహిస్తుంది. ముఖ‍్యంగా వర్లీలోని ఓంకార్‌ 1973 ప్రాజెక్టు బాగా ప్రసిద్ది చెందింది.  హై ప్రొఫైల్‌ సెలబ్రిటీలు మాత్రమే ఇక్కడ ఫ్లాట్లను కొనుగోలు చేయడం గమనార్హం.

మరిన్ని వార్తలు