ఏడుపాయల క్షేత్రంలో చోరీ

29 Nov, 2020 05:23 IST|Sakshi

2.1 కిలోల వెండి గడప తొడుగు మాయం

గతంలో సీసీ కెమెరాలు..హుండీ..స్క్రాప్‌ దొంగతనం

దొరకని దొంగలు.. సిబ్బందిపై అనుమానాలు

పాపన్నపేట (మెదక్‌): మెదక్‌ జిల్లా ఏడుపాయల దుర్గమ్మ క్షేత్రంలో చోరీ జరిగింది. అమ్మవారికి భక్తులు కానుకగా ఇచ్చిన వెండి గడప తొడుగును ఈవో కార్యాలయంనుంచి దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటనలో ఆలయ సిబ్బందిపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్టోబర్‌లో మంజీర నదికి వరదలు వచ్చిన సమయంలో ఆలయ అర్చకులు గర్భగుడి గడపకు ఉన్న వెండి తొడుగు తీసి ఈఓ కార్యాలయంలో భద్రపర్చారు.

అయితే మూడు రోజుల క్రితం వెండి తొడుగు కనిపించక పోవడంతో కార్యాలయంలో వెతికారు. ఎంత వెతికినా వెండి తొడుగు దొరక్కపోవడంతో ఈఓ శ్రీనివాస్‌ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ సంగయ్య తెలిపారు. వెండి గడప తొడుగు సుమారు రెండు కిలోల వంద గ్రాముల బరువు, రూ.84 వేల విలువ చేస్తుందని చెప్పారు. ప్రస్తుతం వెండి తొడుగు దాచి ఉంచిన కార్యాలయంలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ దొంగతనం జరగడం గమనార్హం. 

గతంలోనూ చోరీలు..
ఏడుపాయల క్షేత్రంలో గతంలోనూ పలు దొంగతనాలు జరిగాయి. ఆలయ హుండీని పగులగొట్టి సొత్తును దోచుకెళ్లారు. రెండేళ్ల క్రితం ఇనుప స్క్రాప్‌ మాయమైంది. ఇటీవల ఘనపురం ఆనకట్టకు వెళ్లే దారిలో బిగించిన సీసీ కెమెరాలను సైతం దొంగలు ఎత్తుకెళ్లారు. ఇప్పటివరకు దొంగలు దొరకలేదు. పలు దొంగతనాల్లో ఆలయ సిబ్బంది ప్రమేయంపై ఆరోపణలు వచ్చాయి. 

మరిన్ని వార్తలు