ఇంటి నుంచి కిడ్నాప్​ చేసి.. అమానుషంగా ప్రవర్తించారు!

30 Jan, 2022 18:41 IST|Sakshi

జైపూర్​: దళితులు,వెనుక బడిన వర్గాలపై అఘాయిత్యాలు.. వివక్షతలను నిరోధించడానికి ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన ఇప్పటికి కొన్నిచోట్ల దారుణాలు జరుగుతూనే ఉన్నాయి.  తాజాగా, రాజస్తాన్​లో జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. రాజస్తాన్​లోని చురులోని రుఖాసర్​  గ్రామానికి చెందిన.. 25 ఏళ్ల రాకేష్​ మేఘ్వాల్​ని కొంత మంది వ్యక్తులు  అతని ఇంటి నుంచి అర్ధరాత్రి  కిడ్నాప్​ చేశారు.

ఆ తర్వాత అతని పట్ల అమానుషంగా ప్రవర్తించారు. వారంతా కలిసి మద్యం సేవించారు. ఆ తర్వాత.. అదే బాటిల్​లో మూత్రవిసర్జన చేసి బాధితుడితో బలవంతంగా తాగించారు. అయితే, వీరిమధ్య పాతకక్ష్యల నేపథ్యంలో ఈ విధంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన జనవరి 26 న జరిగింది. బాధితుడిని రాత్రి 11ల ప్రాంతంలో.. బలవంతంగా కిడ్నాప్​ చేసి పొలాల్లోనికి తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడ మద్యం తాగారు.

బాధితుడిని విచక్షణ రహితంగా కొట్టి, అతనిచేత మూత్రం తాగించారు. వారి ఆధీపత్యం చూపించుకోవడానికి ఇలా క్రూరంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. మేఘ్వాల్​ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోనికి వచ్చింది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎనిమిది మందిపై కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం.. ఉమేష్​, బీర్బల్​ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.  మిగతా నిందితులు పరారీలో ఉన్నట్లు గుర్తించారు. వీరిని  గాలించడం కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు రతన్‌గఢ్ సర్కిల్ అధికారి హిమాన్షు శర్మ తెలిపారు.

చదవండి: రాహుల్​కు.. హర్​సిమ్రత్​ కౌర్​ బాదల్​ చురకలు.. అలాంటి ప్రచారాలు మానుకోవాలి

మరిన్ని వార్తలు