నెత్తురోడిన రహదారులు..బస్సు ఢీకొని ఇద్దరు, కారు ఢీకొని మరొకరు మృతి

2 Jan, 2023 08:36 IST|Sakshi

సాక్షి, కంటోన్మెంట్‌: నగరంలో ఉంటున్న కుమారుడిని చూసేందుకు నిర్మల్‌ నుంచి వచ్చిన వృద్ధ దంపతులు ఆర్టీసీ బస్సు ఢీకొని మృతి చెందిన సంఘటన బోయిన్‌పల్లి చౌరాస్తాలో ఆదివారం చోటు చేసుకుంది.. నిర్మల్‌ నగరానికి చెందిన తులసీదాస్‌ (65), రాజమణి (62) దంపతులు నగరంలోని గచ్చిబౌలిలో ఉంటున్న తమ కుమారుడు రామరాజు ఇంటికి వెళ్లేందుకు ఆదివారం నగరానికి వచ్చారు.

మధ్యాహ్నం బోయిన్‌పల్లిలో బస్సు దిగి రోడ్డు దాటుతుండగా బాలానగర్‌ నుంచి సికింద్రాబాద్‌ వైపునకు వెళ్తున్న జీడిమెట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వీరిని ఢీకొట్టింది.  తీవ్రంగా గాయపడిన వీరిని స్థానికులు ఆంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా అప్పటికే ఇద్దరూ మృతి చెందారు. పోలీసులు బస్సు డ్రైవర్‌ మార్గం నరహరి అదుపులోకి తీసుకున్నారు. మృతుల కుమారుడు రామరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

తరచూ ప్రమాదాలు.. పట్టించుకోని అధికారులు 
బోయిన్‌పల్లి చౌరస్తాలో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఆగ్రహించిన స్థానికులు పోలీసులు, అధికారులకు కనువిప్పు కలగాలంటూ ఓ పక్క అంబులెన్స్‌లో మృతదేహాలు, ఆర్టీసీ బస్సును చూపిస్తూ ఓ వీడియో రూపొందించి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. పాదచారులు రోడ్డు దాటేందుకు తగిన ఏర్పాట్లు లేకపోవడం కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. 

కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం 
కుషాయిగూడ: కారు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కుషాయిగూడ పీఎస్‌ పరిధిలోని మల్లాపూర్‌ అశోక్‌నగర్‌ కాలనీ మర్రిగూడ హెచ్‌పీ పెట్రోల్‌ పంప్‌ వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బిహార్‌కు చెందిన రాజు మహతో నగరానికి వలసవచ్చి మల్లాపూర్‌లోని న్యూ నర్సింహనగర్‌లో కుటుంబంతో సహా నివాసం ఉంటూ ఉల్లిపాయల వ్యాపారం చేస్తున్నాడు.

ఆదివారం ఉదయం తోపుడుబండిపై ఉల్లిపాయలు విక్రయిస్తుండగా  మర్రిగూడ హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌ సమీపంలో వెనుక నుంచి  వేగంగా వచి్చన కారు అతడిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.  గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు. మృతుడి బావ నాగేందర్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

(చదవండి: బంజారాహిల్స్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. ఇద్దరు మృతి)

మరిన్ని వార్తలు