48 గంటల్లోనే దొంగను పట్టేశారు 

29 Aug, 2020 11:00 IST|Sakshi
కేసు వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ దిలీప్‌కిరణ్, చిత్రంలో సీఐ శ్రీనివాసరావు

రూ.4.20లక్షల బంగారు ఆభరణాలు రికవరీ

ఏలూరు టౌన్‌: ఇంట్లో బంగారు ఆభరణాలను అపహరించిన దొంగను పోలీసులు రెండు రోజుల్లోనే అరెస్టు చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు రూరల్‌ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏలూరు డీఎస్పీ డాక్టర్‌ దిలీప్‌కిరణ్‌ వివరాలు తెలిపారు. ఈ సమావేశంలో ఏలూరు రూరల్‌ సీఐ అనసూరి శ్రీనివాసరావు, పెదపాడు ఎస్‌ఐ జ్యోతిబసు ఉన్నారు. పెదపాడు మండలం అప్పనవీడు గ్రామానికి చెందిన ఉదయ భాస్కర్‌రెడ్డి, నాగకళ్యాణి భార్యభర్తలు. వీరిద్దరూ స్థానికంగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వ్యక్తిగత పనులపై ఈనెల 25న ఇంటికి తాళాలు వేసి వీరు వేరే గ్రామానికి వెళ్ళారు. మరుసటి రోజు ఉదయం ఇంటికి చేరుకుని చూసేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోనికి వెళ్ళి చూసుకోగా ఇంట్లో ఉండాల్సిన 13కాసుల బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్లు గుర్తించారు. వెంటనే పెదపాడు ఎస్‌ఐ జ్యోతిబసుకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం విచారణ చేపట్టారు. ఈ క్రమంలో నల్లజర్ల గ్రామానికి చెందిన ఎస్‌కే రహీమ్‌ గ్రామంలో అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేయగా దొంగతనానికి పాల్పడింది తానేనని ఒప్పుకున్నాడు. అతని నుంచి రూ.4.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేవలం 48 గంటల్లోనే దొంగతనం కేసును ఛేదించిన పోలీసు అధికారులను డీఎస్పీ అభినందించారు. నిందితుడ్ని పట్టుకోవటంలో ప్రతిభ కనబరిచిన సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ జ్యోతిబసు, హెచ్‌సీ సువర్ణరాజు, కానిస్టేబుల్‌ ప్రదీప్, వెంకటేశ్వరరావు, నరేష్‌లను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.   

మరిన్ని వార్తలు