కారుణ్య నియామకం.. కార్యాలయమే సొంతం!

26 Aug, 2021 11:13 IST|Sakshi

తిరుపతి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఆయన ఓ చిరుద్యోగి.. ఖరీదైన దుస్తులతో ఆర్భాటంగా కనిపిస్తాడు.. అధికారుల అండదండలతో రూ.కోట్లకు పడగలెత్తాడు.. సొంత సిబ్బంది సాయంతో యథేచ్ఛగా పైరవీలకు పాల్పడుతున్నాడు..  మామూళ్లు ముట్టజెప్పనిదే రిజిస్ట్రేషన్‌ సాగనివ్వడు.. తన ఆదేశాలను బేఖాతర్‌ చేస్తే నానా రభస సృష్టిస్తాడు.. ప్రశ్నించిన వారిని కించపరుస్తాడు.. అడ్డొచ్చిన వారిని హడలెత్తిస్తాడు.. కారుణ్య నియామకంతో ఉద్యోగంలో చేరి కార్యాలయాన్నే శాసిస్తున్నాడు.. బదిలీ చేసినా మళ్లీ యథాస్థానానికే పోస్టింగ్‌ తెచ్చుకున్న ఘనుడు.. వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఈ చిరుద్యోగి వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. 

సాక్షి, తిరుపతి(చిత్తూరు): తిరుపతి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో వాటాల రగడ చర్చనీయాంశంగా మారింది. కొందరు అధికారులు తమ అవసరాల కోసం పెంచి పోషించిన అవినీతి వృక్షం శాఖోపశాఖలుగా విస్తరించింది. పదేళ్ల క్రితం కారుణ్య నియామకం కింద కార్యాలయంలో చేరిన ఓ చిరుద్యోగి ధాటికి ప్రస్తుతం ఉన్నతాధికారులే హడలిపోయే పరిస్థితి ఏర్పడింది. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లోటుపాట్లను క్షుణ్ణంగా తెలిసిన సదరు ఉద్యోగి విధులు.. సిబ్బంది అడిగిన ఫైళ్లు, టీ, కాఫీలు తెచ్చివ్వడం. కానీ ఆయన ఏనాడూ ఆ పనిని చేసిన పాపాన పోలేదు. తాను సొంతంగా వేతనాలు చెల్లించి ముగ్గురు వ్యక్తులను నియమించుకుని, వారితో ఆయా పనులను చేయిస్తున్నాడు. వారి ద్వారా రిజిస్ట్రేషన్లకు సంబంధించిన లావాదేవీలను నడిపిస్తున్నాడు. ఆయన వైఖరిని భరించలేక బదిలీ చేసినా ట్రిబ్యునల్‌కు వెళ్లి మరీ తిరుపతి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికే పోస్టింగ్‌ తెచ్చుకోవడం గమనార్హం. 

రిజిస్టేషన్‌కు రూ.2వేలు 
ప్రతి రిజిస్ట్రేషన్‌కు రూ.2వేలను సదరు చిరుద్యోగికి సమర్పించాల్సిందే. ఇలా రోజుకు సుమారు వంద రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు తెలిసింది. తాను నియమించుకున్న వ్యక్తుల ద్వారా ఈ సొమ్మును వసూలు చేయిస్తుంటాడు. మామూళ్ల నగదులో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం సిబ్బందికి సైతం వాటాలు ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వాటాల పంపిణీలో వివాదం ఏర్పడడం వల్లే మంగళవారం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో గొడవ జరిగిందని పలువురు గుసగుసలాడుకుంటున్నారు.

ఒక చిరుద్యోగి ఇంత భారీస్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పారదర్శక లావాదేవీలకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అనధికారిక సిబ్బంది కార్యాలయంలో యథేచ్ఛగా సంచరిస్తున్నా చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.  

రూ.కోట్లకు పడగలెత్తాడు 
సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ప్రతి సమాచారం ఇట్టే తెలుసుకుంటాడు. ఆయన నియమించుకున్న ముగ్గురు అనధికారిక ఉద్యోగులు రోజూ ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి.. ఎవరు ఏ పనిచేశారు.. ఎవరికి ఎంత ముట్టింది అనే విషయాలను ఎప్పటికప్పుడు సదరు చిరుద్యోగికి అందిస్తుంటారు. డాక్యుమెంట్‌ రైటర్స్‌ పైనా పెత్తనం చేస్తుంటారు. మాట వినకుంటే దౌర్జన్యాలకు సైతం దిగుతుంటారు. ఇందుకోసం ముగ్గురికి రోజూ రూ.6వేల చొప్పున ఇస్తుంటాడు. ఆయన మాత్రం కనీసం రూ.50వేలు జేబులో వేసుకోనిదే ఇంటికి వెళ్లే ప్రసక్తే ఉండదని తెలిసింది.

అక్రమ సంపాదనతో రూ.కోట్లు కూడబెట్టినట్లు సమాచారం. తిరుపతి నగర నడిబొడ్డులో మూడు భవనాలు, విలాసవంతమైన మూడు కార్లు, ఖరీదైన ఐదు మోటారుసైకిళ్లు ఆయన సొంతం. ఇవి కాకుండా మరిన్ని విలువైన ఆస్తులు ఉన్నట్లు పలువురు సిబ్బంది చర్చించుకుంటున్నారు. ఆయన పూటకో వాహనంలో కార్యాలయానికి వస్తుంటాడు. చేతి పది వేళ్లకు ఉంగరాలు వేసుకుని ఖద్దర్‌ దుస్తులతో ఆర్భాటంగా తిరుగుతుంటాడు.  

చదవండి: నేపాలీ గ్యాంగ్‌: దోచేస్తారు.. దేశం దాటేస్తారు! 

మరిన్ని వార్తలు