అవంత గ్రూప్‌ ప్రమోటర్‌ థాపర్‌ అరెస్ట్‌

5 Aug, 2021 01:16 IST|Sakshi

అక్రమ ధనార్జన కేసులో ఈడీ చర్య

న్యూఢిల్లీ: అక్రమ ధనార్జన కేసులో అవంత గ్రూప్‌ ప్రమోటర్, వ్యాపారవేత్త థాపర్‌ అరెస్ట్‌ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ప్రకటించింది. ఈడీ ప్రకటన ప్రకారం 60 సంవత్సరాల థాపర్‌ అక్రమ ధనార్జన నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద మంగళవారం రాత్రి అరెస్టయ్యారు. అంతకుముందు ఢిల్లీ, ముంబైల్లో ఆయన వ్యాపారాలకు సంబంధించి పలు కార్యాలయాలపై ఈడీ దాడులు జరిపింది. ఇప్పటికే విచారణను ఎదుర్కొంటున్న యస్‌ బ్యాంక్‌ సహ వ్యవస్థాపకులు రాణా కపూర్, ఆయన భార్య బిందు అక్రమ ధనార్జన కేసులో ధాపర్‌ ప్రమోటర్‌గా ఉన్న అవంత రియల్టీ పాత్ర కూడా ఉన్నట్లు వస్తున్న ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది.

సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను ప్రాతిపదికగా చేసుకుని ఈడీ ఈ కేసు విచారణ జరుపుతోంది. అవంత రియల్టీకి రుణ సౌలభ్యతల్లో రాయితీలు, సడలింపులు, మినహాయింపుల పొడిగింపు, అదనపు రుణ అడ్వాన్స్‌లు వంటి అంశాల్లో తీవ్ర స్థాయిలో నిబంధనల ఉల్లంఘనలు, అక్రమ ధనార్జన, ఆస్తుల క్రయ విక్రయ లావాదేవీలు జరిగినట్లు సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ పేర్కొంటోంది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తదితర బ్యాంకుల్లో రూ.2,435 కోట్ల మోసానికి పాల్పడినట్లు థాపర్‌సహా పలువురిపై సీబీఐ గత నెల్లో ఒక కేసులో నమోదుచేసింది. సీజీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ సొల్యూషన్స్‌ మోసపూరిత కేసులో విచారణలో భాగంగా ఈ కేసు నమోదయ్యింది..

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు