‘స్కిల్‌’ లూటీ కేసులో బాబు సన్నిహితుడి విచారణ 

20 Dec, 2022 05:10 IST|Sakshi

బిల్లుల చెల్లింపుపై లక్ష్మీనారాయణను ప్రశ్నించిన ఈడీ 

షెల్‌ కంపెనీల ద్వారా రూ.241 కోట్లు తరలించిన టీడీపీ పెద్దలు 

వేగం పుంజుకున్న కేసు విచారణ 

సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు హయాంలో చోటు చేసుకున్న ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) కుంభకోణంలో విచారణను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన నాటి ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ కె.లక్ష్మీనారాయణను ఈడీ అధికారులు హైదరాబాద్‌లో సోమవారం విచారించారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన లక్ష్మీనారాయణ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు.

లక్ష్మీనారాయణను ఈడీ అధికారులు దాదాపు ఏడు గంటలపాటు సుదీర్ఘంగా విచారించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీమెన్స్‌ కంపెనీతో ఒప్పందం ముసుగులో ప్రజాధనాన్ని కొల్లగొట్టిన తీరుపై ఆయన్ను ప్రధానంగా ప్రశ్నించినట్లు సమాచారం. దాదాపు రూ.3,300 కోట్ల విలువైన ప్రాజెక్టులో ఒప్పందం ప్రకారం 90 శాతం ఖర్చు చేయాల్సిన సీమెన్స్‌ కంపెనీ ఒక్క రూపాయి కూడా వెచ్చించకుండానే టీడీపీ సర్కారు రూ.371 కోట్ల బిల్లులను చెల్లించింది.

అందులో రూ.241 కోట్లను షెల్‌ కంపెనీల ముసుగులో  టీడీపీ పెద్దల ఖాతాల్లోకి తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా సీమెన్స్‌ కంపెనీ పేరిట బిల్లులు ఎలా చెల్లించారని ఈడీ అధికారులు లక్ష్మీనారాయణను నిశితంగా విచారించినట్లు  సమాచారం. షెల్‌ కంపెనీల పేరిట మనీ ల్యాండరింగ్‌కు పాల్పడటంపై కూడా ఈడీ అధికారులు గుచ్చి గుచ్చి ప్రశ్నించినట్టు అధికారవర్గాలు తెలిపాయి. 

పెదబాబు, చినబాబే సూత్రధారులుగా.. 
కాగితాలపై ప్రాజెక్టును చూపించి టీడీపీ ప్రభుత్వ పెద్దలు రూ.241 కోట్లు కాజేయడంపై ఈడీ దర్యాప్తు జోరందుకుంది. సీమెన్స్‌ కంపెనీతో రూ.3,300 కోట్ల విలువైన ప్రాజెక్టు పేరిట కథ నడిపించి రూపాయి కూడా పెట్టుబడి రాకుండా, అసలు ప్రాజెక్టే లేకుండా రూ.241 కోట్ల బిల్లులు చెల్లించేశారు. ఏపీఎస్‌ఎస్‌డీసీకి అప్పటి సీఎం చంద్రబాబు చైర్మన్‌గా ఉండగా నాటి ఐటీ శాఖ మంత్రిగా లోకేశ్‌ ఉండటం గమనార్హం. దీన్నిబట్టి ఈ కుంభకోణం వెనుక ఎవరి పాత్ర ఉందన్నది స్పష్టమవుతోంది.

ప్రభుత్వం పది శాతం నిధులను సమకూరిస్తే సీమెన్స్, డిజైన్‌ టెక్‌ సంస్థలు 90 శాతం పెట్టుబడి పెడతాయని ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఈ ప్రాజెక్టు గురించి సీమెన్స్‌ కంపెనీకి అసలు తెలియదు. భారత్‌లో గతంలో కంపెనీ ఎండీగా వ్యవహరించిన సుమన్‌బోస్‌ అలియాస్‌ సౌమ్యాద్రి శేఖర్‌బోస్‌తోపాటు టీడీపీ పెద్దలు డిజైన్‌టెక్‌తో కలిసి కథ నడిపించారు.  

సీమెన్స్‌ సంస్థ ఒక్క రూపాయి ఖర్చు చేయకపోయినా చంద్రబాబు ఆదేశాలతో అప్పటి ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్‌ ప్రభుత్వ వాటాగా రూ.371 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఏపీఎస్‌ఎస్‌డీసీ’కి అప్పట్లో ఎండీగా ఉన్న రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కె.లక్ష్మీనారాయణ, ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న గంటా సుబ్బారావు ఈ కుంభకోణంలో కీలకంగా వ్యవహరించారు.

సాఫ్ట్‌వేర్, పరికరాల కోసం సీమెన్స్‌ కంపెనీకి రూ.130 కోట్లు చెల్లించి మిగిలిన రూ.241 కోట్లను నకిలీ ఇన్‌వాయిస్‌తో పలు షెల్‌ కంపెనీల ద్వారా విదేశాల్లోని ఖాతాల్లోకి మళ్లించారు. తద్వారా చంద్రబాబు సన్నిహితులు మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ నిర్ధారించింది.

ఈ కుంభకోణంలో పాత్రధారులుగా వ్యవహరించిన కె.లక్ష్మీనారాయణ, గంటా సుబ్బారావు, ఓఎస్డీ నిమ్మగడ్డ వెంకట కృష్ణప్రసాద్, చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ కె.ప్రతాప్‌కుమార్, షెల్‌ కంపెనీల ప్రతినిధులతో సహా మొత్తం 26 మందికి ఈడీ ఇటీవల నోటీసులు జారీచేసింది.

షెల్‌ కంపెనీల ప్రతినిధులను ఈడీ అధికారులు ఇటీవల విచారించారు. తాజాగా లక్ష్మీ నారాయణను పలు కోణాల్లో విచారించడం ద్వారా ఈ కేసును ఈడీ ఎంత తీవ్రంగా పరిగణిస్తోందో స్పష్టమవుతోంది. ఈ కేసులో ఈడీ మరింత దూకుడుగా వ్య­వహ­రించనున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు.   

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు