మనీల్యాండరింగ్‌ కేసులో ఈడీ ఎదుట ఫరూఖ్‌

20 Oct, 2020 06:30 IST|Sakshi

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కి సంబంధించిన 40 కోట్ల రూపాయల మనీ ల్యాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లాని ఆరు గంటలపాటు విచారించింది. రాజ్‌బాగ్‌లోని తమ కార్యాలయంలో ఫరూఖ్‌ను ఈడీ విచారించింది. విచారణ అనంతరం బయటకు వచ్చిన ఫరూఖ్‌ అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులోని వాస్తవాలను కోర్టులు నిర్ణయిస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఫరూఖ్‌ బతికున్నా, లేదా చనిపోయినా, 370 ఆర్టికల్‌ కోసం మన పోరాటం కొనసాగుతుంది. నన్ను ఉరితీసినా మన నిర్ణయం మారదు’ అని అన్నారు. అబ్దుల్లాపై ఈడీ విచారణ చేపట్టడం రాజకీయ వేధింపుల్లో భాగమేనని, జమ్మూకశ్మీర్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలతో కొత్తగా ఏర్పడిన పీపుల్స్‌ అలయెన్స్‌ భాగస్వామ్య పక్షాలు ఆరోపించాయి. ప్రభుత్వ వ్యతిరేకతను, ప్రభుత్వంపై అసంతృప్తిని కేంద్ర ప్రభుత్వం సహించే స్థితిలో లేదని వారు విమర్శించారు.

మరిన్ని వార్తలు