ఉదయం ప్రేమవివాహం.. సాయంత్రానికి శవమైన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌

13 Nov, 2022 14:29 IST|Sakshi

సాక్షి, చెన్నై(అన్నానగర్‌): ప్రేమ వివాహం చేసుకున్న చెన్నై ఇంజినీర్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. చెన్నైలోని తాంబరానికి చెందిన సురేష్‌ కుమార్‌ (30) సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇతను, విల్లుపురం జిల్లా కోటకుప్పం ప్రాంతానికి చెందిన గోమతి (30) పెరంబలూరు ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో చదువుతున్న సమయంలో ప్రేమించుకున్నారు.

గోమతి ప్రస్తుతం కోటకుప్పంలో మున్సిపల్‌ ఉద్యోగినిగా పని చేస్తోంది. వారి కుటుంబసభ్యులకు కూడా వీరిద్దరి ప్రేమ గురించి తెలిసింది. ఈ క్రమంలో సురేష్‌ కుమార్, గోమతి తల్లిదండ్రుల అంగీకారంతో ఆమెను శుక్రవారం ఉదయం పుదుచ్చేరిలోని కాలాపట్టు ప్రాంతంలో ఉన్న బాలమురుగన్‌ ఆలయంలో వివాహం చేసుకున్నాడు. తరువాత సాయంత్రం కోటకుప్పంలోని ఓ ప్రైవేట్‌ హాలులో వీరి రిసెప్షన్‌ జరగాల్సి ఉంది.

చదవండి: (బెడ్‌రూమ్‌లో అనుమానాస్పద స్థితిలో యువతి మృతి.. ఏం జరిగింది?)

ఈ స్థితిలో వరుడు సురేష్‌ కుమార్‌ కుటుంబం చెన్నైకి చెందిన వారు కావడంతో రిసెప్షన్‌కు ముందు కొత్తకుప్పంలోని ఓ ప్రైవేట్‌ హాస్టల్‌లో బస చేశారు. తర్వాత సురేష్‌ కుమార్‌ దుస్తులు మార్చుకుని, వస్తానని చెప్పి గదిలోకి వెళ్లాడు. చాలాసేపటికి అతను బయటకు  రాలేదు. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు గదిలోకి వెళ్లి చూశారు. ఆ సమయంలో సురేష్‌ కుమార్‌ అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. బంధువులు సురేష్‌ కుమార్‌ను   పుదుచ్చేరిలోని జిప్‌మర్‌ ఆస్పత్రికి తరలించారు.

అయితే మార్గం మధ్యలోనే సురేష్‌ కుమార్‌ మృతి చెందాడు. పోలీసులు సురేష్‌ కుమార్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుదుచ్చేరి జిప్‌మర్‌ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, మృతికి గల కారణాలపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.    

చదవండి: (కీచక ఉపాధ్యాయుడు.. విద్యార్థిని పదేపదే గదికి పిలిపించి...)

మరిన్ని వార్తలు