యువ ఇంజనీర్‌ నిర్వాకం.. బర్త్‌డేను గ్రాండ్‌గా జరుపుకోవాలని..

28 Jul, 2021 12:55 IST|Sakshi

న్యూఢిల్లీ: సాధారణంగా చాలా మంది తమ పుట్టిన రోజును ఘనంగా నిర్వహించుకోవడానికి ఇష్టపడుతుంటారు. దీని కోసం అనేక ప్లాన్‌లు వేస్తుంటారనే విషయం తెలిసిందే. ఒక మంచి హోటల్‌లో బంధువులు, స్నేహితులను పిలిచి వారి మధ్య బర్త్‌డే వేడుకలను గ్రాండ్‌గా జరుపుకొని తమ రిచ్‌నేస్‌ను చూయించుకోవాలనుకుంటారు. అయితే, ఇక్కడో యువ ఇంజనీర్‌ కూడా.. తన జన్మదినాన్ని గ్రాండ్‌గా సెలబ్రెట్‌ చేసుకోవాలనుకున్నాడు. అయితే, దీని కోసం ఆ ప్రబుధ్దుడు మాత్రం చోరీల బాటపట్టాడు.  ఈ సంఘటన ఢిల్లీలోని మన్సరోవర్‌ పార్క్‌ పరిధిలో  చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాలు.. ఢిల్లీకి చెందిన ఒక మహిళ ప్రతిరోజు మన్సరోవర్‌ పార్క్‌కు వాకింగ్‌కు వెళ్తుండేది. ఈ క్రమంలో.. గడిచిన శుక్రవారం రోజు మహిళ వాకింగ్‌ చేస్తుండగా గుర్తు తెలియని  యువకుడు ఆమెను అనుసరించాడు. ఒక్కసారిగా ఆమెపై దాడిచేసి, బలవంతంగా చెవిరింగులను లాక్కొని అక్కడి నుంచి బైక్‌పై పరారయ్యాడు. దీంతో, ఆమె షాక్‌కు గురయ్యింది. ఆ తర్వాత తేరుకొని స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆగంతకుడు ముఖానికి మాస్క్‌ ధరించి ఉన్నాడని తెలిపింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో పార్క్‌ పరిధిలోని 30 సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆగంతకుడు ముఖానికి మాస్క్‌ ధరించి ఉండటం.. బైక్‌కు నంబర్‌ ప్లేట్‌ లేకపోవడం వలన నిందితుడిని పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారింది.

నిందితుడి కోసం పోలీసులు బృందాలుగా విడిపోయి గస్తీని ముమ్మరం చేశారు. ఈ క్రమంలో.. గత ఆదివారం రోజున పార్క్‌ పరిసరాల్లో ఒక యువకుడు నంబర్‌ప్లేట్‌లేని బైక్‌తో ఉండటాన్ని గస్తీ పోలీసులు గమనించారు. అతని కదలికలు అనుమానస్పదంగా ఉన్నాయి. దీంతో ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలీలో విచారించారు. దీంతో అతగాడు.. తన పేరు గౌతమ్‌ అని.. షాహదారాలోని జ్యోతి నగర్‌లో ఉంటానని తెలిపాడు. కాగా,  బీఎస్‌ఈఎస్‌లో జూనియర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నట్లు తెలిపాడు. కాగా, తన పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్‌గా జరుపుకోవడం కోసమే చోరికి పాల్పడినట్లు అంగీకరించాడు. చోరి చేసిన బంగారాన్ని ఒక దుకాణంలో అమ్మేసినట్లు తెలిపాడు. దీంతో గౌతమ్‌పై పలు సెక్షన్‌ల కింది కేసుల నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు