గుండెపోటుతో బీటెక్‌ విద్యార్థి మృతి: మిన్నంటిన రోదనలు

16 Apr, 2021 09:35 IST|Sakshi

ఒక్కగానొక్క ఆశ రాలిపోయింది

గుండెపోటుతో ఇంజనీరింగ్‌ విద్యార్థి మృతి

అనంతపురం విద్య: ఒక్కగానొక్క కొడుకు.. తల్లిదండ్రులు ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. కూలి పనులతో పొట్ట పోసుకుంటున్నా.. ఏనాడూ తమ బిడ్డకు తక్కువ చేయలేదు. తమ కష్టం బిడ్డకు రాకూడదనుకున్నారు. ఈ క్రమంలోనే తమ స్థాయికి మించి ఉన్నత విద్యాబద్ధులు చెప్పించసాగారు. మరో ఏడాదిలో ఇంజినీరింగ్‌ పూర్తి చేసుకుని జీవితంలో స్థిరపడతాడనుకుంటున్న తరుణంలో విధి వక్రీకరించింది. తల్లిదండ్రుల ఆశలు అడియాసలయ్యాయి.

రెండు రోజుల క్రితం తమతో కలిసి ఎంతో ఉత్సాహంగా గడిపిన బిడ్డ కంటికి కానరాని లోకాలకు వెళ్లిపోయాడనే విషయం తెలియగానే ఈ నిరుపేద దంపతుల గుండె చెరువైంది. ‘అమ్మా.. ఇంకొక్క సంవత్సరం.. ఇంజినీరింగ్‌ పూర్తవుతుంది. తర్వాత ఉద్యోగం చేసి మీ ఇబ్బందులన్నీ తీరుస్తా..’ అన్న కుమారుడి చివరి మాటలు చెవుల్లో మారుమోగుతుండగా.. ‘బిడ్డా... లే నాన్న... నీవు తప్ప మాకు దిక్కెవరే.. ఉద్యోగం చేస్తానంటివి కదయ్యా... లే అయ్యా.. మా కంటి ముందు నీవుంటే చాలయ్యా’ అన్న తల్లిదండ్రులు రోదనలు విన్న విద్యార్థి లోకం కన్నీటి పర్యంతమైంది.  

ఏం జరిగిందంటే..  
అనంతపురం రూరల్‌ మండలం నరసనాయకుంట గ్రామానికి చెందిన మల్లికార్జున, సత్యమ్మ దంపతులు. వీరి ఒక్కగానొక్క కుమారుడు బి.అబ్రçహాం. కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్న మల్లికార్జున దంపతులు... ఈ కష్టాలు తమ బిడ్డకు రాకూడదని భావించారు. ఈ క్రమంలోనే తమ శక్తికి మించి విద్యాబుద్ధులు చెప్పిస్తూ వచ్చారు. ప్రస్తుతం అబ్రçహాం... ఎస్కేయూ క్యాంపస్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ (ఈసీఈ) మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఉగాది పండుగకు ఊరికి వెళ్లి తల్లిదండ్రులతో సంతోషంగా గడిపి బుధవారం రాత్రి తిరిగి వర్సిటీకి అబ్రహాం చేరుకున్నాడు.

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ఈసీఈ మూడో సంవత్సరం చదువుతున్న బి. అబ్రహాం (20)  గురువారం ఉదయం జిమ్‌లో వర్క్‌అవుట్‌ ముగించుకుని హాస్టల్‌కు చేరుకున్నాడు. టిఫెన్‌ చేసిన తర్వాత ఛాతిలో నొప్పిగా ఉందంటూ ఎస్కేయూ హెల్త్‌ సెంటర్‌కు వెళ్లాడు. అక్కడ ఈసీజీ తీస్తుండగానే భరించలేని నొప్పితో విలవిల్లాడుతూ కన్నుమూశాడు. తీవ్రమైన గుండెపోటుతో అతను మరణించినట్లు హెల్త్‌ సెంటర్‌ వైద్యులు ప్రాథమికంగా ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న నిరుపేద తల్లిదండ్రులు ఆగమేఘాలపై హెల్త్‌ సెంటర్‌ వద్దకు చేరుకుని బోరున విలపించారు. తమ బిడ్డ జ్ఞాపకాలను, అతని చివరి మాటలను గుర్తు చేసుకుంటూ వారు రోదించిన తీరు పలువురిని కన్నీరు పెట్టించింది.  

చదవండి: చిన్నారి వైద్యం కోసం వెళ్తూ..

మరిన్ని వార్తలు