షాకింగ్‌ ఘటన.. స్నేహితురాలితో కలిసి స్కూటీపై వెళ్తుండగా..

19 Sep, 2022 16:26 IST|Sakshi
కట్టా నందిని (ఫైల్‌)

తొండంగి(కాకినాడ జిల్లా): హాస్టల్‌లో చదువుతున్న ఆ ఇంజినీరింగ్‌ విద్యార్థిని తల్లిదండ్రులను పలకరించేందుకు స్వగ్రామానికి వచ్చి తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందిన ఘటన ఆదివారం బెండపూడి జతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఒక్కగానొక్క కుమార్తె రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
చదవండి: ఏడు పేజీల సూసైడ్ నోట్‌.. కుమార్తెలతో సహా తండ్రి ఆత్మహత్య

మృతురాలి బంధువులు, పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం కోటనందూరు మండలం కాకరాపల్లి గ్రామానికి చెందిన కట్టా కాశీవిశ్వనాథం కుమార్తె కట్టా నందిని(21) కాకినాడ సూరంపాలెం ప్రగతి ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ నాలుగో సంవత్సరం చదువుతోంది. తన స్నేహితురాలు వసంతతో కలిసి ఆదివారం మధ్యాహ్నం హాస్టల్‌ నుంచి స్కూటీపై బయలుదేరి కోటనందూరు మండలం కాకరాపల్లి వెళ్లింది. తల్లిదండ్రులను పలకరించిన అనంతరం భోజనం చేసి స్కూటీపై మళ్లీ సూరంపాలెం హాస్టల్‌కు బయలుదేరారు.

అన్నవరం బైపాస్‌ నమూనా టెంపుల్‌  సమీపంలో బెండపూడి శివారు జాతీయ రహదారిపై వీరి స్కూటీ అదుపు తప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో నందిని అక్కడికక్కడే మృతిచెందగా వసంతకు స్వల్పగాయాలయ్యాయి. దీనిపై తొండంగి ఎస్‌ఐ రవికుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌ నిమిత్తం తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు.    

మరిన్ని వార్తలు