Erode Illegal Surrogacy Case: ఐదేళ్లుగా ప్రియుడితో కన్నకూతురిపై అత్యాచారం

7 Jun, 2022 18:31 IST|Sakshi

ఛీ.. ఛీ.. ఈ భూమ్మీద ఏ మహిళ కూడా ఇంతటి ఘోరానికి పాల్పడి ఉండదేమో!. కూతురు యుక్త వయసుకు రాగానే.. దుర్మార్గానికి తెర తీసింది ఇక్కడో కన్నతల్లి. కూతురిపై ప్రియుడితో అత్యాచారం చేయించడమే కాదు.. బలవంతంగా కూతురి నుంచి అండ సేకరణ చేపట్టి దొడ్డిదారిలో సరోగసీ(అద్దె గర్భం) కోసం అమ్మేసుకుంది. ఒకటికాదు.. రెండుకాదు.. ఐదేళ్లుగా ఈ ఘోరం జరుగుతూ వస్తోంది. 

తమిళనాడు ఈ రోడ్‌లో కన్నతల్లి చేసిన అక్రమ నిర్భంధ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఓ కన్నతల్లి తన కూతురి నుంచి బలవంతంగా అండ సేకరణ చేపట్టి.. అక్రమ సరోగసీ కోసం ఆస్పత్రులకు అమ్మేసుకుంది. పైగా ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం నడుపుతూ.. అతనితో కూతురిపైనే అత్యాచారం చేయిస్తూ వచ్చింది. 

తమిళనాడు ఈ రోడ్‌లో జరిగిన ఈ ఘోరంపై హైలెవల్‌ దర్యాప్తు కొనసాగుతోంది. మెడికల్‌ అండ్‌ రూరల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ డైరెక్టోరేట్‌ అధికారులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. జాయింట్‌ డైరెక్టర్‌ విశ్వనాథన్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం.. సోమవారం స్టేట్‌ హోంలో ఉన్న బాధితురాలిని పరామర్శించి మూడు గంటలపాటు ప్రశ్నించారు. ఈ రోడ్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాలోని ఆస్పత్రుల్లో ఈ ఇల్లీగల్‌ సరోగసీ వ్యవహారం నడిచినట్లు అధికారులు నిర్దారణకు వచ్చారు.

ఈ రోడ్‌కు చెందిన నిందితురాలు(33).. భర్తకు దూరంగా ఉంటోంది. బిడ్డను తనతో పాటే పెంచుకుంటోంది. ఈ క్రమంలో మరో వ్యక్తితో ఆమె  వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. కూతురు యుక్తవయస్సుకు రాగానే.. తన ప్రియుడి ద్వారానే అత్యాచారం చేయించింది. గత ఐదేళ్లుగా.. బాధితురాలిపై అత్యాచార పర్వం కొనసాగుతోంది. బాధితురాలి నుంచి అండాలను బలవంతంగా సేకరించి.. ఆస్పత్రులకు అమ్మేసుకుంటూ ఆ తల్లి, ఆమె ప్రియుడు, మధ్యవర్తి.. డబ్బులను పంచుకుంటూ వస్తున్నారు. అంతేకాదు.. కూతురి వయసును ఆధార్‌కార్డులో మార్పించేసి మరీ ఈ దందాకు పాల్పడుతూ వస్తున్నారు.

జూన్‌ 1వ తేదీన వేధింపులు భరించలేక బాధితురాలు ఇంటి నుంచి పరారైంది. సేలంలోని తన స్కూల్‌ స్నేహితురాలి ఇంట్లో తలదాచుకుని.. బంధువుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోక్సో యాక్ట్‌, ఐపీసీలోని పలు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసుకున్న పోలీసులు.. బాధితురాలి తల్లి, ఆమె ప్రియుడు, మధ్యవర్తి, ఆధార్‌ను మార్పిడి చేసిన వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. అంతేకాదు అక్రమ సరోగసీకి పాల్పడిన ఆస్పత్రులపై, వైద్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది తమిళనాడు ప్రభుత్వ వైద్య శాఖ.

మరిన్ని వార్తలు