‘ఎస్కేప్‌’ కార్తీక్‌ దొరికాడు.. 80 ఇళ్లలో చోరీ, 17వసారి అరెస్ట్‌

1 Jan, 2022 19:30 IST|Sakshi
ఎస్కేప్‌ కార్తిక్‌

సాక్షి, బెంగుళూరు: చోరీ కేసులో అరెస్ట్‌ అవడం.. జైలు నుంచి లేదా, పోలీసుల అదుపులో నుంచి తప్పించుకొని మళ్లీ దొంగతనాలు చేయడం అతనికి అలవాటుగా మారింది. కర్ణాటకలోని కల్యాణ్‌ నగర్‌లో నివాసం ఉంటున్న 32 ఏళ్ల కార్తిక్‌ కుమార్ అలియాస్‌ (ఎస్కేప్‌ కార్తిక్‌)ను కామాక్షిపాళ్య పోలీసులు 17వసారి అరెస్ట్‌ చేశారు. ఇటీవల జరిగిన ఓ చోరీ కేసులో దర్యాప్తు చేసిన పోలీసులకు ఎస్కేప్‌ కార్తిక్‌ మళ్లీ పట్టుబడ్డాడు. అతని వద్ద ఉన్న సుమారు రూ.11లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

16 ఏళ్ల వయసు నుంచే కార్తిక్‌కు చోరీలు చేయటం అలవాటుగా మారిందని పోలీసులు పేర్కొన్నారు. సుమారు 80 ఇళ్లలో దొంగతనాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. రాత్రి వేళల్లో వీధుల గుండా  తిరుగుతూ ముందుగానే రెక్కీ నిర్వహించిన ఇళ్లలోకి వెళ్లి చోరీలు చేస్తాడని పోలీసులు వివరించారు.

2008లో ఓ చోరీ కేసులో అరెస్టై పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు ఉన్న సమయంలో భోజనం పంపిణీ చేసేందుకు వచ్చిన ఫుడ్ వ్యాన్‌లో దాక్కొని పారిపోయాడు. దీంతో అతనికి ‘ఎస్కేప్ కార్తీక్’ అనే పేరు వచ్చింది. పోలీసులు 45 రోజుల తర్వాత అతన్ని పట్టుకున్నారు. 2010లో మరోసారి కార్తిక్‌ పోలీసుల కస్టడీ నుంచి పారిపోయాడు. కామాక్షిపాళ్య పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి.. బసవేశ్వర నగర్, కేపీ అగ్రహారాల్లో కూడా కేసులు నమోదైనట్లు గుర్తించారు.

మరిన్ని వార్తలు