ప్రతి 84 నిమిషాలకు ఒక ప్రాణం బలి

17 Feb, 2021 08:31 IST|Sakshi

రోజుకు 20 మందిని మింగుతున్న రహదారులు

నేటితో ముగియనున్న రోడ్డు భద్రతా మాసోత్సవాలు

ప్రభావం చూపని రవాణా, పోలీసు, వైద్య, విద్యా, పంచాయతీ శాఖల ప్రచారం

ఉల్లంఘనదారులకు రూ. 13.18 కోట్ల జరిమానాలు

జనవరిలో 627 మంది దుర్మరణం, 2,038 మందికి గాయాలు

గతేడాది జనవరి కంటే పెరిగిన ప్రమాదాలు, మృతులు

సాక్షి, హైదరాబాద్‌: రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా వాహనదారుల తీరులో మార్పు రావడం లేదు. ఏటా దేశంలో దాదాపు 1,60,000 మంది (రాష్ట్రంలో 6,600–7,200 మంది) అకాల మరణం చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది రోడ్డు భద్రతా వారోత్సవాల స్థానంలో మాసోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు అన్ని రాష్ట్రాల్లోని రవాణా, పోలీసు, వైద్య, విద్య, పంచాయతీ శాఖలను భాగస్వాములను చేసింది. కోవిడ్‌ కారణంగా తెలంగాణలో స్కూళ్లు సరిగ్గా తెరుచుకోకపోవడంతో విద్యాశాఖ అంతగా ప్రచారం చేపట్టనప్పటికీ పోలీసు, రవాణా, పంచాయతీ, వైద్య శాఖలు చురుగ్గానే ప్రచారం చేశాయి. అయినా గతేడాది జనవరితో పోలిస్తే ఈ జనవరిలో ప్రమాదాలు, క్షతగాత్రుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 

పెరిగిన ప్రైవేటు, వ్యక్తిగత వాహనాలు.. 
దేశంలో కరోనా అన్‌లాక్‌ ప్రక్రియ మొదలైనా వైరస్‌ వ్యాప్తి భయంతో చాలా మంది రైళ్లు, బస్సులను కాదని వ్యక్తిగత, ప్రైవేటు వాహనాల వైపు మొగ్గుచూపారు. దీంతో కార్లు, బైకుల విక్రయాలు భారీగా పెరిగాయి. ఫలితంగా ట్రాఫిక్‌తోపాటు నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారి సంఖ్య పెరగడం తదితర కారణాల వల్ల ఈ జనవరిలో రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. దీనికితోడు రాష్ట్రంలోని బ్లాక్‌ స్పాట్ల నివారణపై ఇంతవరకూ ఎలాంటి ముందడుగు పడలేదు. చాలాచోట్ల రోడ్ల మరమ్మతులు చేపట్టలేదు. ఇవి కూడా ప్రమాదాలు అధికమయ్యేందుకు కారణమయ్యాయి. గతేడాది జనవరిలో జరిగిన 2,008 ప్రమాదాల్లో 576 మంది మరణించగా 2,072 మంది గాయపడ్డారు. ఈ ఏడాది జనవరిలో 2,027 ప్రమాదాలు చోటుచేసుకోగా అందులో 627 మరణాలు సంభవించాయి. 2,038 గాయాలపాలయ్యారు. అంటే ప్రతి 24 గంటలకు 20 మంది మరణిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రతి 84 నిమిషాలకు ఒక ప్రాణాన్ని రహదారులు మింగేస్తున్నాయి. 

మార్పు చూపని ప్రచారం.. 
కారు సీటు బెల్టు ధరించడం, ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్‌ వాడకం ప్రాధాన్యం తదితర అంశాలపై దాదాపు నెలరోజులు పోలీసులు, రవాణాశాఖ అధికారులు విస్తృత ప్రచారం నిర్వహించినా అవేవీ వాహనదారుల్లో పెద్దగా మార్పు చూపించలేకపోయాయి. ఎప్పటిలాగే వాహనదారులు రహదారి భద్రతా నిబంధనలకు నీళ్లొదిలి గతేడాది కంటే అధికస్థాయిలో ఉల్లంఘనలకు పాల్పడుతుండటం గమనార్హం. మోటారు వెహికల్‌ యాక్ట్‌ ప్రకారం పోలీసులు విధించిన జరిమానాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా జనవరిలో నమోదు చేసిన వివిధ ఉల్లంఘనలు, జరిమానాలు ఇలా..

క్రం.సం         ఉల్లంఘన రకం                          నమోదైన కేసులు    విధించిన జరిమానా 
01                 అతివేగం                                        1,19,489              10,69,85,175 
02                   ఓవర్‌లోడ్‌                                       16,638                15,24,635 
03                  రాంగ్‌ పార్కింగ్‌                                 72,881               1,43,79,164 
04                  గూడ్సు వాహనాల్లో ప్రయాణం              4,886              7,60,351 
05       సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌                                            10,044             69,85,390 
06    సీటు బెల్టు ధరించకపోవడం                          10,016    12,11,415 
    మొత్తం    2,33,954    13,18,46,130 

మరిన్ని వార్తలు