మహాస్తూపంలో ‘గుప్త నిధుల’ తవ్వకాలు

10 Oct, 2021 05:03 IST|Sakshi
మహాస్థూపంలో తవ్వకాలతో ఏర్పడిన మట్టి కుప్పలు

కొత్తూరు బౌద్ధ క్షేత్రంలో అలజడి

పురావస్తు శాఖకు గతంలో విలువైన భరిణెలు లభ్యం

రాంబిల్లి: విశాఖ జిల్లాలో ప్రసిద్ధి చెందిన.. కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలోని కొత్తూరు బౌద్ధ క్షేత్రంలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. ఈ క్షేత్రంలో గల మహాస్తూపంలోని ఓ గదిలో ఎనిమిది అడుగుల మేర గొయ్యిని తవ్వినట్లు పురావస్తు శాఖ కన్జర్వేటివ్‌ అసిస్టెంట్‌ శ్రీనివాస్‌ తెలిపారు. శనివారం ఉదయం విధులకు హాజరైన  సిబ్బంది మహాస్తూపంలో మట్టి కుప్పను గుర్తించి తనకు సమాచారం ఇవ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.

కొన్ని ఏళ్ల క్రితం ఈ బౌద్ధక్షేత్రంలో కేంద్ర పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో విలువైన ధాతు, రాతి భరిణెలు లభ్యమయ్యాయి. వీటిలో కళ్లు మిరిమిట్లు గొలిపే వజ్రాలు, ఇతర వస్తువులున్నాయి. ఈ బౌద్ధ క్షేత్రాన్ని ధన దిబ్బలుగా పిలుస్తారు. ఈ ఘటన సంచలనం కలిగించింది. శనివారం రాత్రి నుంచి ఇక్కడ పోలీసులను పహారా పెట్టారు. 

మరిన్ని వార్తలు