ఎక్సైజ్‌ అధికారుల చీకటి బాగోతం

31 Jan, 2022 04:25 IST|Sakshi
మదనపల్లెలోని ఆనంద్‌ బార్‌

ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు 

మదనపల్లె టౌన్‌: చిత్తూరు జిల్లా మదనపల్లెకి చెందిన ఓ ఎక్సైజ్‌ సీఐ, ఎస్‌ఐ నిబంధనలకు విరుద్ధంగా బార్‌ను లీజుకు తీసుకుని చీకటి వ్యాపారం చేస్తున్న వ్యవహారం వెలుగు చూసింది. ప్రభుత్వ షాపులకు సరఫరా చేయాల్సిన మద్యాన్ని బార్‌కు మళ్లించి ప్రభుత్వ షాపుల్లో కృత్రిమ కొరత సృష్టించడమే కాకుండా.. అదే మద్యాన్ని సదరు బార్‌లో అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇదేమని నిలదీసిన వ్యాపార భాగస్వామిపై సీఐ, ఎస్‌ఐ కిరాయి రౌడీలతో దాడులు చేయించగా.. ఈ వ్యవహారం బట్టబయలైంది. ఈ కేసులో బాధితుడైన నాదెళ్ల వెంకట శివకుమార్‌ టూటౌన్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి.

మదనపల్లెకు చెందిన ఆనందరెడ్డి తన భార్య నిర్మల పేరిట మదనపల్లె అవెన్యూ రోడ్డులో ఆనంద్‌ బార్‌ పేరిట గతంలోనే లైసెన్స్‌ పొందాడు. దీనిని ఎక్సైజ్‌ విభాగంలోని మదనపల్లె మద్యం డిపోలో పనిచేస్తున్న సీఐ జవహర్‌బాబు, ఎస్‌ఐ సురేష్‌కుమార్, స్థానిక ఏబీఐ కాలనీలో ఉండే నాదెళ్ల వెంకట శివకుమార్‌ కలిసి లీజుకు తీసుకున్నారు. కాగా, సీఐ, ఎస్‌ఐ ప్రభుత్వ మద్యం షాపులకు కేటాయించాల్సిన బీర్లు, ఖరీదైన మద్యాన్ని బార్‌కు మళ్లించి బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయాలు సాగిస్తున్న విషయం భాగస్వాముడైన వెంకట శివకుమార్‌కు తెలిసింది.

ఈ విషయాన్ని బార్‌ యజమాని ఆనంద్‌కు తెలియజేశాడు. ప్రభుత్వ దుకాణాల్లో అమ్మాల్సిన మద్యాన్ని బార్‌లో అమ్మటం నేరం కాబట్టి ఆ నేరం తనపైకి వస్తుందన్న భయంతో 20 రోజుల క్రితం బార్‌కు తాళాలు వేసి తనకు సరుకు వద్దని సీఐ, ఎస్‌ఐలకు తెగేసి చెప్పాడు. ఆపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆగ్రహించిన సీఐ జవహర్‌బాబు, ఎస్‌ఐ సురేష్‌కుమార్‌ ఆదివారం కిరాయి రౌడీలతో బార్‌ తలుపులు ధ్వంసం చేయడమే కాకుండా అడ్డుకున్న వెంకట శివకుమార్‌పై దాడికి పాల్పడ్డారు. దీనిపై బాధితుడు వెంకట శివకుమార్‌ ఫిర్యాదు చేయగా.. పోలీసులు బార్‌ వద్దకు చేరుకుని ముగ్గురు రౌడీలను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉందని టూటౌన్‌ సీఐ మురళీకృష్ణ తెలిపారు. 

మరిన్ని వార్తలు