చెప్పుకోలేమని తెలుసు.. ఒప్పుకోరనీ తెలుసు

3 Mar, 2021 08:44 IST|Sakshi

వివాహితతో యువకుడి సంబంధం

పెద్దలు మందలిస్తున్నారని ఆత్మహత్యాయత్నం

మహిళ మృతి, విషమ పరిస్థితిలో యువకుడు

సమాజానికి చెప్పుకోలేమని తెలుసు.. ఎవరూ ఒప్పుకోరనీ తెలుసు.. అయినా వారు పరిధి దాటారు. అవమానాలు తప్ప ఆనందం ఉండని బంధం కోరుకున్నారు. రెండు కుటుంబాల గౌరవ మర్యాదల గురించి యోచన చేయలేకపోయారు. కన్నవారు, కడుపున పుట్టిన వారి గురించి ఆలోచించలేకపోయారు. కాలం గడిచే కొద్దీ కలిసి జీవించడం సాధ్యం కాదని వారికి అర్థమైంది.  కావాలనుకున్న బంధం బలవన్మరణం వైపు దారి తీసింది. ఆ ప్రయత్నంలో వివాహిత కన్నుమూయగా.. యువకుడు చావుతో పోరాడుతున్నాడు.   

ఎచ్చెర్ల క్యాంపస్(శ్రీకాకుళం)‌: లావేరు మండలం కేశవరాయనిపాలేంకు చెందిన బోనెల ప్రియాంక అలియాస్‌ అంకమ్మ (32), బోనెల సంతోష్‌ (30)లు సోమవారం రాత్రి పురుగు మందు తాగి ఆత్యహత్మకు ప్రయత్నించారు. వీరిలో ప్రియాంక చనిపోగా.. సంతోష్‌ ఆస్పత్రిలో ప్రాణాల కోసం పోరాడుతున్నారు. వివాహేతర సంబంధం వీరిని చావు వరకు తీసుకెళ్లింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రియాంకకు పన్నెండేళ్ల కిందట సూర్యనారాయణ అనే వ్యక్తితో వివాహమైంది. సూర్యనారాయణ ఓ ప్రైవేటు కంపెనీలో వంట మనిషి పని చే స్తుండగా.. ప్రియాంక కూలి పనులకు వెళ్లేవారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ముగ్గురూ బడికి వెళ్తున్నారు.

ఈ క్రమంలో మూడేళ్ల కిందట బోనెల సంతోష్‌ అనే ఆటో డ్రైవర్‌తో ప్రియాంకకు పరిచయమైంది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ముగ్గురు పిల్లల తల్లి అని తెలిసినా, తన కంటే వయసులో పెద్దదని తెలిసి కూడా సంతోష్‌ ప్రియాంకతో సంబంధం పెట్టుకోవడానికి సంకోచించలేదు. ప్రియాంక కూడా ఆ విషయాలను ఆలోచించలేకపోయింది. కొన్నాళ్లకు వీరి విషయం సూర్యనారాయణకు తెలిసి భార్యను మందలించారు. ఊరి పెద్దల ముందు కూడా పంచాయతీ పెట్టగా.. వారు కూడా మందలించారు. కానీ వారి తీరు మారలేదు. ఫలితంగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి.  ఎందరు ఎన్ని విధాలుగా చెప్పినా ప్రియాంక, సంతోష్‌లు మారలేదు.

ఈ క్రమంలో.. తమకు అంతా అడ్డు పడుతున్నారని భావించి కలిసి చనిపోవడానికి నిర్ణయించుకున్నారు. సోమవారం రాత్రి కేశవరాయనిపాలెం నుంచి చిలకపాలేం చేరుకున్నారు. సమీపంలోని తోటలోకి వెళ్లి ఇద్దరూ పురుగుమందు తాగేశారు. ఈ విషయాన్ని గ్రామంలోని స్నేహితులకు, బంధువులకు ఫోన్‌ ద్వారా చెప్పారు. దీంతో వారు హుటాహుటిన తోటల్లోకి వెళ్లి వెతికారు. అప్పటికే ఇద్దరూ అపస్మారక స్థితికి చేరుకున్నారు. శ్రీకాకుళంలోని రిమ్స్‌కు తీసుకెళ్లగా అదే రోజు రాత్రి ప్రియాంక చనిపోయింది. సంతోష్‌ చికిత్స పొందుతున్నా డు. ప్రియాంక మృతదేహానికి వైద్యులు పోస్టు మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఈ విషాదకర ఘటనతో ముగ్గురు పిల్లలు తల్లి లేని వారైపోయారు. ఔట్‌పోస్టు పోలీసుల సమాచారం మేరకు ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చదవండిహైదరాబాద్‌లో టెకీపై యువకుడి దారుణం 

పబ్జీ ఆట: రెండు గ్రామాల మధ్య చిచ్చు

మరిన్ని వార్తలు