ఏకాంతంగా గడపాలనుకున్న సమయంలో మరో వ్యక్తి అక్కడికి రావడంతో

12 May, 2022 18:05 IST|Sakshi

సాక్షి, మెదక్‌: వివాహేతర సంబంధం మహిళ హత్యకు దారి తీసిన సంఘటన చిన్నశంకరంపేట మండలం ఏడిప్పల్‌ అటవీప్రాంతంలో చోటుచేసుకుంది. హంతకుడే మెదక్‌ పోలీసులకు సమాచారం అందించి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసుకోవడంతో పాపన్నపేట మండలం ఏడుపాయల అటవీప్రాంతంలో పోలీసులు జల్లెడ పట్టినప్పటికి ఫలితం లేకపోయింది. ఎట్టకేలకు హంతకుడి ఫోన్‌ ట్రేస్‌ చేసిన పోలీసులు చిన్నశంకరంపేట మండలం ఏడిప్పల్‌ అటవీ ప్రాంతంలో బుధవారం రాత్రి మహిళ మృతదేహాన్ని గుర్తించారు.

మెదక్‌ మండలం ముగ్దూంపూర్‌ గ్రామానికి చెందిన కుర్మ సాయవ్వ అదే గ్రామానికి చెందిన ఆర్‌టీసీ రిటైర్డ్‌ ఉద్యోగి ఎల్లోల్ల కిషన్‌ వివాహేతర సంబంధం నెరుపుతున్నారు. బైక్‌పై మెదక్‌ నుంచి చిన్నశంకరంపేట వైపు వచ్చారు. మెదక్‌–చేగుంట రహదారిపై పక్కన ఎస్‌.కొండాపూర్‌ గ్రామ శివారులోని ఏడిప్పల్‌ అటవీప్రాంతంలో బైక్‌ను అడవిలోకి మళ్లించారు. వీరు అక్కడ ఉండగానే సాయవ్వకు పరిచయం ఉన్న మరో వ్యక్తి అక్కడికి రావడంతో మాటమాట పెరగడంతో సాయవ్వను చాకుతో హత్య చేసినట్లు ఎల్లోల్ల కిషన్‌ పోలీసులకు సమాచారం అందించాడు.  

పోలీసులకు సమాచారం..ఆపై ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ 
మెదక్‌ నుంచి బైక్‌పై చిన్నశంకరంపేట వైపు బయలుదేరిన సాయవ్వ, కిషన్‌ ఏడిప్పల్‌ అటవీప్రాంతంలోని నడక దారివైపు లోపలికి వెళ్లారు. వీరు అక్కడ ఏకాంతంగా గడపాలనుకున్న సమయంలోనే సాయవ్వకు పరిచయం ఉన్న మరో వక్తి అక్కడికి రావడంతో మాటమాట పెరిగింది. ఈ క్రమంలో చాకుతో మహిళను హత్య చేసిన నిందితుడు కిషన్‌ మెదక్‌ పోలీస్‌లకు ఏడిప్పల్‌ అటవీప్రాంతంలో మహిళను హత్య చేసినట్లు చెప్పి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసుకున్నాడు. పోలీసులు పాపన్నపేట మండలం ఏడుపాయల అటవీ ప్రాంతంలో మెదక్‌ రూరల్‌ సీఐ విజయ్‌ కుమార్, పాపన్నపేట ఎస్‌ఐ విజయ్‌ సిబ్బందితో గాలింపు చేపట్టారు.

నిందితుడు ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసుకోవడంతో సరైన సమాచారం లభించకపోవడంతో అతడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎట్టకేలకు నిందితుడి ఫోన్‌ ట్రెస్‌ చేసి వివరాలు సేకరించారు. ఏడిప్పల్‌ అటవీప్రాంతంలో మృతదేహాన్ని గుర్తించారు. చిన్నశంకరంపేట ఎస్‌ఐ సుభాష్‌గౌడ్, రామాయంపేట సీఐ చంద్రశేఖర్‌ సంఘటన స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేపట్టారు.
చదవండి: ఇబ్రహీంపట్నంలో దారుణం..బాలికకు తెలియకుండా అబార్షన్‌

మరిన్ని వార్తలు