ప్రియుడితో కలిసి ఘాతుకం .. మద్యంతాగి.. భర్త గొంతు నులిమి..

10 Aug, 2021 14:51 IST|Sakshi

సాక్షి, బాన్సువాడ(నిజామాబాద్‌): ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిందో ఇల్లాలు. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి దొరికిపోయింది. బీర్కూర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ కేసు వివరాలను బాన్సువాడ డీఎస్పీ జైపాల్‌రెడ్డి విలేకరులకు సోమవారం వెల్లడించారు.   బీర్కూర్‌ మండల కేంద్రంలోని డబుల్‌ బెడ్రం కాలనీలో నివసించే ఆర్‌ఎంపీ వైద్యుడు రాఘవేందర్‌ (38), భార్య శృతిక(26) ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. అయితే, శృతికకు, కల్లరి గంగాధర్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది.

ఈ వ్యవహారం వారి సంసారంలో గొడవలకు దారి తీసింది. గత నెల 31న శృతిక, గంగాధర్, అతడి బావమరిది బాలరాజు అలిస్‌ బాలు కలిసి రాఘవేందర్‌ ఇంట్లో మద్యం సేవిస్తున్నారు. అదే సమయంలో ఇంటికి వచ్చిన రాఘవేందర్‌ భార్యతో గొడవకు దిగాడు. అతడ్ని అడ్డు తొలగించాలని భావించిన శృతిక తన ప్రియుడు గంగాధర్, బాలుతో కలిసి భర్తను అర్ధరాత్రి వరకు తీవ్ర చిత్రహింసలకు గురి చేసి, గొంతు నులిమి చంపేసింది. తెల్లవారుజామున అదే కాలనీలో నివసించే కె.గంగాధర్‌ వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పి కాపాడాలని శృతిక కోరింది.

దీంతో హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు సహకరించాడు. నలుగురు కలిసి మృతదేహాన్ని ఫ్యాన్‌ కొక్కానికి చీరతో వేలాడదీసి, ఆత్మహత్యగా చిత్రీకరించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకోగా, ఆర్థిక ఇబ్బందుల వల్ల తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని శృతిక ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆత్మహత్య కేసుగా నమోదు చేసుకొన్నారు. అయితే, తన అన్న ఆత్మహత్య చేసుకోడని, అది ముమ్మాటికి హత్యేనని మృతుడి తమ్ముడు శ్రీనివాస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

స్పందించిన బాన్సువాడ రరల్‌ సీఐ చంద్రశేఖర్, బీర్కూర్‌ ఎస్సై రాజేశ్‌ సిబ్బందితో రంగంలోకి దిగారు. మృతుడి శరీరంపై గాయాలు ఉండడం, హత్య జరిగిన రోజు రాఘవేందర్‌ ఇంటికి ఇద్దరు వచ్చారని తెలియడంతో తమదైన శైలిలో విచారణ జరిపారు. ఈ క్రమంలో పథకం ప్రకారమే హత్య చేశారని దర్యాప్తులో వెలుగు చూసింది. హత్యకు పాల్పడిన శృతిక, ఆమె ప్రియుడు కల్లరి గంగాధర్, బాలుతో పాటు ఆత్మహత్యగా చిత్రీకరించి, నిందితులను రక్షించేందుకు సహాయపడ్డ కె.గంగాధర్‌లను సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారం రోజుల్లోనే కేసును ఛేదించిన సీఐ, ఎస్సై రాజేశ్‌తో పాటు పలువురు కానిస్టేబుళ్లను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. 

తల్లిదండ్రులకు దూరమైన పిల్లలు..
రాఘవేందర్‌ పిల్లల పరిస్థితి విషమయంగా మారింది. కులాంతర వివాహం చేసుకున్న రాఘవేందర్, శృతిక దంపతులకు కూతురు (6), కుమారుడు(3) ఉన్నారు. తండ్రి హత్యకు గురవడం, తల్లి జైలుకు వెళ్లడంతో ఇద్దరు పిల్లలు దిక్కు తోచని స్థితిలో పడిపోయారు. వారు ప్రస్తుతం బాబాయ్‌ వద్ద ఉన్నారు.

మరిన్ని వార్తలు